కరోనాపై పోరాటంలో రాహుల్, కాంగ్రెస్ దూరం.. బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కౌంటర్

రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (ఫైల్ ఫోటో)

రాహుల్, ప్రియాంక, వారి కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కరోనాపై పోరాటంలో పాలుపంచుకోవడం లేదని బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విమర్శించారు.

 • Share this:
  కరోనాపై కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మండిపడ్డారు. కరోనాపై అంతా కలిసికట్టుగా పోరాటం చేస్తున్న సమయంలో రాహుల్, ప్రియాంక ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ఆయన అన్నారు. రాహుల్, ప్రియాంక, వారి కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కరోనాపై పోరాటంలో పాలుపంచుకోవడం లేదని ఆయన విమర్శించారు. రాహుల్, ప్రియాంక ప్రైవేటు కంపెనీలను తప్పుబట్టడం సరికాదని రాథోడ్ అన్నారు. వాళ్లు కరోనాపై పోరాటంలో నిమగ్నమయ్యారని వ్యాఖ్యానించారు. రాహుల్, కాంగ్రెస్ పార్టీ తప్ప దేశంలోని ప్రతి పౌరుడు కరోనాపై పోరాటంలో ఉన్నారని రాథోడ్ అన్నారు.

  కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో మందులు, పడకలు, ఆక్సిజన్ కొరత ఉందని గుర్తు చేశారు. మద్యం అమ్మకాలు యధేచ్ఛగా జరుగుతున్నాయని.. అయితే మిగతా మార్కెట్లు మాత్రం మూసి ఉన్నాయని అన్నారు. కరోనాపై పోరాటంలో రాజస్థాన్ ప్రభుత్వం సంసిద్ధత ఇదేనా అని రాథోడ్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వ్యూహం పెద్ద నోట్ల రద్దు వంటిదని రాహుల్ గాంధీ విమర్శించారు.

  ఈ ప్రక్రియలోనూ ప్రజలు క్యూలైన్లలో నిలబడి డబ్బు, ఆరోగ్యం, ప్రాణాలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీని కారణంగా కేవలం కొద్దిమంది పారిశ్రామికవేత్తలు మాత్రమే లాభపడతారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ పంపిణీ మూడో విడతలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వాళ్లంతా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులు, వ్యాపార సంస్థలు వ్యాక్సినేషన్ కోసం సంస్థల నుంచి నేరుగా టీకాలు కొనుగోలు చేయొచ్చని అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: