అయోధ్య రాముడి నామస్మరణలో యావత్ దేశం ప్రతి ధ్వనిస్తోంది. రామాలయ నిర్మాణం కోసం బీజేపీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా నిర్వహిస్తున్నారు. రామాలయ నిర్మానంలో అందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతోనే విరాళాలు సేకరిస్తున్నారు. ఎవరికి తోచినంత వారు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రూ.2 కోట్ల 2 లక్షల 32 వేలు విరాళం ఇచ్చారు. తన తండ్రి యలమంచిలి జనార్ధనరావు పేరు మీద ఈ విరాళం అందజేశారు.
ఇక ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రూ.5 లక్షల విరాళం, సీసీఎల్ గ్రూప్ రూ.6 కోట్ల 39 లక్షల విరాళం, సిద్ధార్థ అకాడమీ తరపున రూ.15 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులను చెక్కులను ఇచ్చారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.30 లక్షల విరాళం అందజేశారు. ఇటీవల మైహోమ్ గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు రూ. 5 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి రూ. 6 కోట్లు ఇచ్చారు. అపర్ణ కన్స్స్ట్రక్షన్స్ రూ. 2 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ కోటి రూపాయలు విరాళం ఇచ్చాయి.
కాగా, అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాలు సేకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం శ్రీ అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రూ.10, రూ.100, రూ.1000 కూపన్లను ముద్రించింది. రూ.2 వేలు, ఆ పైన ఇచ్చే విరాళాలకు రశీదులు కూడా ఇస్తున్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు నిధుల సమీకరణ కొనసాగుతుందని ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ నేతలు తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:January 24, 2021, 20:33 IST