Home /News /politics /

BJP LEADER HUGE HOPES ON JANASENA CHIEF POWER STAR PAWAN KALYAN MOVIE VAKEEL SAAB HIT NGS

tirupati by poll: తిరుపతి ఉప ఎన్నికను వకీల్ సాబ్ గట్టెక్కిస్తాడా? సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీ

తిరుపతి ఉప ఎన్నికను వకీల్ సాబ్ గట్టెక్కిస్తాడా?

తిరుపతి ఉప ఎన్నికను వకీల్ సాబ్ గట్టెక్కిస్తాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకిల్ సాబ్ కోసం మెగా అభిమానులే కాదు.. బీజేపీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో తమను గట్టెక్కించేది వకీల్ సాబ్ మాత్రమే అని భావిస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. తమ విజయం ఖాయమంటున్నారు? మరి సినిమాకు ఉప ఎన్నికకు లింకేంటి?

ఇంకా చదవండి ...
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోట్లాది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం వకీల్ సాబ్.. ఈ నెల 9న భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అయితే అది తెలిసిందే కదా అనుకుంటున్నారా? కానీ ఈ సినిమా హిట్టు, ఫట్టలతో తిరుపతి ఉప ఎన్నికకు లింకు ఉంది. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గా వకీల్ సాబ్ రిలీజ్ అవుతోంది. అంటే అక్కడికి సరిగ్గా వారానికి ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన నేరుగా పోటీ చేయకపోయినా.. జనసేన మద్దతుతో బీజేపీ బరిలో ఉంది. బీజేపీ తరుపున మాజీ ఐఎఎస్ రత్న ప్రభ, వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ తరపున మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీపడుతున్నారు. అయితే ఇటీవల పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కనిపించింది. మున్సిపల్ ఎన్నికల్లో రెండు చోట్ల మినహా అధికార పార్టీ హవా కొనసాగింది. 73 మునిసిపాలిటీలను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. తరువాత ఎక్స్ అఫిషియో బలంతో మైదుకూరును కూడా సొంతం చేసుకుంది. అంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశానికి కేవలం తాడిపత్రి మాత్రమే మిగిలింది. దీంతో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపైనా వైసీపీ శ్రేణులు ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ నేతలు ఇప్పుడు కేవలం మెజార్టీనే లెక్క వేసుకుంటున్నారు. నాలుగు లక్షలపైగా మెజారిటీతో నెగ్గడమే లక్ష్యంగా వైసీపీ బరిలో దిగుతోంది. అయితే వకీల్ సాబ్ సినిమా తమను రేసులో నిలబెడుతుందని బీజేపీ -జనసేన పార్టీ అభిమానులు ఆశిస్తున్నారు.

  ఇప్పటి వరకు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. కీలక ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు చెందిన హీరోల చిత్రాలు మ్యాజిక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు తమకు ఇష్టమైన స్టార్స్ మద్దతు తెలిపిన పార్టీలు పరాజయం పాలయితే.. అభిమానుల్లో ఆక్రోశం కూడా అదే స్థాయిలో ఉంటుంది. దీంతో తరువాత తమ హీరోలు నటించే చిత్రాలను విజయపథంలో పయనింప చేయాలని అభిమానులు భావిస్తూ ఉంటారు. అలాంటి ఘటనలకు ఎన్నో తెలుగు సినిమాలు ఉదహరణగా నిలిచాయి కూడా. 1984లో ఇందిరాగాంధీ హత్య తరువాత చోటు చేసుకున్న లోక్ సభ ఎన్నికల్లో దేశమంతటా కాంగ్రెస్ గాలి వీచింది. అయితే తెలుగునాట మాత్రం ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం ఘనవిజయం సాధించింది. 33 లోక్ సభ స్థానాలకు పోటీ చేసిన తెలుగుదేశం 30 స్థానాల్లో విజయం సాధించింది. అయితే టీడీపీ అంతటి ఘన విజయం వెనుక ఓ సినిమా ప్రభావం ఉంది అన్నది వాస్తవమే. ఆ ఎన్నికల షెడ్యూల్ కు కొన్ని రోజుల ముందు విడుదల చేసిన యన్టీఆర్ నటించిన బ్రహ్మంగారి చరిత్ర ఘన విజయం సాధించింది. ఆ గెలుపు ఎన్నికలకూ కలసి వచ్చిందనే చెప్పాలి.

  1984 లోక్ సభ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ తరపున కృష్ణ ప్రచారం చేస్తూ నంద్యాలలో జరిగిన దాడిలో గాయపడ్డారు. దాంతో అప్పట్లో సూపర్ స్టార్ అభిమానులు కాంగ్రెస్ పై మండిపడ్డారు. కొన్ని రోజులకే వచ్చిన ఆయన అగ్నిపర్వతంను సూపర్ హిట్ చేశారు అభిమానులు. ఇక బాలకృష్ణ ఎంతో ఓపికగా 2009లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ప్రచారం చేశారు. అయితే అంతకు ముందు తెలుగుదేశం సాధించిన సీట్ల కంటే రెట్టింపు సంఖ్య పెరిగింది.. తప్ప అధికారం మాత్రం దక్కలేదు. దీంతో అభిమానుల నిరాశకు గురయ్యారు. ఆ వెంటనే వచ్చిన సింహా సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు.

  ఇలా చెప్పాలంటే చాలా ఉదహరణలే కనిపిస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఒకే ఒక్క సీటును నెగ్గింది. రాజోలులో నెగ్గిన ఎమ్మెల్యే రాపాక కూడా తరువాత జనసేనకు బైబై చెప్పి.. జగన్ కు జై కొట్టారు. అప్పటి నుంచీ ఆయన అభిమానుల మనసుల్లో తీవ్ర బాధ చోటు చేసుకుంది. ఇటీవల స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ జనసేన అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయింది. దీంతో పవన్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. పవన్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో వస్తోన్న తొలి సినిమా వకీల్ సాబ్, ఈ సినిమాతోనే సంతృప్తి చెందాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు అన్ని పాజిటివ్ బజ్ తెచ్చాయి. కచ్చితంగా వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ అవుతుందని పవన్ అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. అంతేకాదు సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. పవన్ అభిమానులు రెట్టించిన ఉత్సాహంలో తిరుపతి ఉప ఎన్నికలో పని చేస్తారని.. ఆ ఉత్సాహమే తమని గెలుపిస్తుందని బీజేపీ నేతలు సైతం భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అందుకే వకీల్ సాబ్ పెద్ద హిట్ అవ్వాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Bjp, Bjp-janasena, Pawan kalyan, Tirupati, Tirupati Loksabha by-poll, Vakeel Saab

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు