news18-telugu
Updated: December 10, 2018, 2:15 PM IST
చంద్రబాబు నాయుడు, జీవీఎల్ నరసింహారావు(ఫైల్ ఫోటో)
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తున్నట్టు చంద్రబాబు చెబుతున్న మాటలు.. అబద్ధమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు కొట్టిపారేశారు. ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందు అన్ని పార్టీలు, తమ భాగస్వామ్య పక్షాలతో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం సహజమని చెప్పారు. అలాంటి సమావేశాన్ని కూడా తానే ఏర్పాటు చేస్తున్నట్టుగా.. చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గల్లీ అవార్డులను కూడా గ్లోబల్ స్థాయి అవార్డులుగా ప్రచారం చేసుకునే చంద్రబాబు.. తనచుట్టూ తాను భ్రమించడంతో పాటు ఇతరపార్టీల చుట్టూ తిరుగుతూ ప్రజలను భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ విమర్శించారు.
పార్లమెంట్లో పార్టీల మధ్య సమన్వయం కోసం.. ప్రతీ సెషన్‌కు ముందు ప్రతిపక్ష పార్టీల సమావేశం జరగడం మామూలేనన్నారు జీవీఎల్. అయితే, చంద్రబాబు మాత్రం తానే చక్రం తిప్పుతున్నట్టు అనుకూల మీడియాతో ఏపీలో తెగ ప్రచారం చేయించుకుంటున్నారని విమర్శించారు. ఆ విషయాన్ని దేశంలోని ఏ రాష్ట్రంలోనూ, ఏ పార్టీ నాయకుడూ.. చెప్పడం లేదని… కేవలం ఏపీలో చంద్రబాబు అనుకూల మీడియా డబ్బా కొడుతోందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. సమావేశమవుతున్న ప్రతిపక్ష పార్టీలన్నీ చాలాకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని… వారి పంచన ఆలస్యంగా చేరిన చంద్రబాబు.. వారందరినీ తానే ఏకం చేస్తున్నానని చెప్పుకోవడం విచిత్రంగా ఉందన్నారు. ఏపార్టీ కూడా చంద్రబాబు వద్దకు రాలేదని… చంద్రబాబే ఆయా పార్టీల నేతల దగ్గరికెళ్లి చక్రం తిప్పుతానంటూ బతిమలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల విడుదలయ్యాక.. ‘చంద్రబాబుతో పొత్తుపెట్టుకుని దెబ్బతిన్న రాహుల్’ అంటూ కొత్త హెడ్లైన్ చూస్తారని సెటైర్ వేశారు.
Published by:
Santhosh Kumar Pyata
First published:
December 10, 2018, 2:15 PM IST