ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై అన్ని రాజకీయ పక్షాలు, రాజకీయ కుటుంబాలు తీవ్ర స్పందనను వెలువరిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి ని ఉద్దేశించి అధికార వైసీపీ ఎమ్మెల్యేలు దారుణంగా మాట్లాడారని ఆరోపణలు వెల్లెవెత్తడం, ఈ ఘటన తర్వాత చంద్రబాబు.. మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానంటూ అసెంబ్లీని వీడటం, ఆ తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తూ తన భార్యను వైసీపీ నేతలు దారుణంగా అవమానించారని చెప్పడం తెలిసిందే. అయితే, చంద్రబాబు ఆరోపణల్ని సీఎం జగన్ తోపాటు వైసీపీ నేతలంతా ఖండిచడంతోపాటు అసలు భువనేశ్వరిని ఎవరేమన్నారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. నారా భువనేశ్వరి కేంద్రబిందువుగా చెలరేగిన వివాదంపై ఎన్టీఆర్ కుటుంబీకులు ఒక్కొక్కరుగా స్పందించారు..
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేరుతో అనుచితర రీతిలో సాగిన వివాదంపై భువనేశ్వరి సోదరి, ఏపీ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా సాగుతోన్న కాండను ఖండిస్తున్నామని పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ కూతుళ్లుగా తాము విలువలతో పెరిగామని, ఎక్కడా రాజీపడబోమని ఆమె చెప్పారు. ‘భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడడం బాధ కలిగించింది. క్యారెక్టర్ అసాసినేషన్ (వ్యక్తిత్వ హననం) సహేతుకం కాదు. నేను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగాం. విలువల్లో రాజీపడే ప్రసక్తి లేదు’ అని పురందేశ్వరి ట్వీట్ చేశారు.
నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారనే ఆరోపణలపై నందమూరి కుటుంబానికే చెందిన మరో కీలక నేత, దివంగత హరికృష్ణ కూతురు సుహాసిని సైతం ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని, వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతో బాధాకరమని సుహాసిని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేయడం తగదన్నారు. నందమూరి సుహాసిని గతంలో కూకట్ పల్లి(తెలంగాణ) అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం తెలిసిందే.
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం అనుచితన పరిణామాలు చోటుచేసుకోవడం, తన భార్యను దారుణంగా కించపరిచారంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు.. వైసీపీ నేతలపై ఆరోపణలు చేయడం, తిరిగి సీఎంగానే సభకు వస్తానంటూ అసెంబ్లీ నుంచి వచ్చేయడం, ప్రెస్ మీట్ లో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవటం తెలిసిందే. వ్యవసాయంపై చర్చ సందర్భంగా టీడీపీ నేతలు.. జగన్ బాబాయి వివేకా హత్యోదంతాన్ని లేవనెత్తగా, అందుకు ప్రతిగా వైసీపీ నేతలు దివంగత టీడీపీ నేత మాధవరెడ్డి మరణాన్ని ప్రస్తావించడం, కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు భువనేశ్వరి పేరెత్తకుండా ‘లోకేశ్ ఎలా పుట్టాడో తేలాలి’అంటూ ఆమెను కించపర్చేలా వ్యాఖ్యలుచేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Assembly, Chandrababu Naidu, Nandamuri Family, Nara Bhuvaneshwari, Purandeswari