tirupati by poll: గాజు గ్లాసుపై వైసీపీ కుట్ర.. కేంద్ర ఎన్నికల సంఘంతో బీజేపీ పెద్దల భేటీ?

ప్రతీకాత్మక చిత్రం

తిరుపతి ఉప ఎన్నికలో గాజు గ్లాసు వివాదం ముదురుతోంది. జనసేన గుర్తును వేరే పార్టీకి కేటాయించడం వెనుక వైసీపీ కుట్ర ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు బీజేపీ, జనసేన కీలక నేతలు.

  • Share this:
    తిరుపతి ఉప్ప ఎన్నికలో జనసేన పోటీ చేయడం లేదు. అయితే ఇప్పుడు జనసేన గుర్తు గాజు గ్లాసు చుట్టూ తిరుపతి రాజకీయం తిరుగుతోంది. జనసేన పార్టీకి గతంలోనే గాజు గ్లాసు గుర్తు కేటాయించింది.  ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలో జనసేన పోటీలో లేదు. దీంతో స్థానికంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. దీంతో వివాదం మొదలైంది. గాజు గ్లాసు ఉంటే.. పవన్ అభిమానుల, జనసేన కార్యకర్తలు కన్ఫ్యూజ్ అయ్యి ఆ గాజు గ్లాసుకు ఓటు వేసే అవకాశం ఉంటుందని.. అప్పుడు తమ అభ్యర్థికి నష్టం జరుగుతుందని బీజేపీ భావిస్తోంది. జనసేన గుర్తును వేరే అభ్యర్థికి ఎలా కేటాయిస్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

    ఇదంతా అధికార వైసీపీ కుట్ర అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ -జనసేన ఉమ్మడి అభ్యర్థికి వస్తున్న ఆధరణ చూసి వైసీపీ భయపడుతోందని.. ఎన్నికల ధర్మ యుద్ధంలో గెలవలేకనే ఇలాంటి కుట్రలకు వైసీపీ తెరలేపిందని జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానికంగా బీజేపీకి ఉన్న బలంతో పాటు, జనసేన మద్దతు కూడా భారీగా ఉండడంతో అధికార పార్టీలో భయం మొదలైందని.. అందుకే డమ్మీ పార్టీని తెరపైకి తీసుకువచ్చి.. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు వచ్చేలా వైసీపీ అధిష్టానం కుట్రలు చేసిందని బీజేపీ-జనసేన నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.

    ప్రచారానికి ముందు తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీలోనే ఉండదని అధికార పార్టీ లైట్ తీసుకుంది. కానీ రోజు రోజుకూ ప్రచారం ముమ్మరం అయిన తరువాత ప్రస్తుతం వైసీపీ వర్సెస్ బీజేపీ అన్న రీతిలో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత ప్రచారానికి వచ్చిన తరువాత వైసీపీ నేతలు విమర్శల దాడి పెంచారు. తిరుపతి సభలో వైసీపీని నేరుగా పవన్ ప్రశ్నిస్తంచడంతో.. అప్పటి నుంచి బీజేపీ-జనసేన టార్గెట్ గా వైసీపీ మంత్రులు కౌంటర్లు వేస్తున్నారు. టీడీపీ నేతలపై విమర్శలు తగ్గాయి. దీంతో బీజేపీ లో కాస్త ఆశలు చిగురించాయి. కానీ ఇలాంటి సమయంలో గాజు గ్లాసు రూపంలో షాక్ తగిలింది, జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును నవతరం పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించింది. దీంతో జనసేన ఓట్లు క్రాస్ అవుతాయని బీజేపీ ఆందోళన చెందుతోంది.

    నవతరం పార్టీ వాదన ప్రకారం.. జనసేన ఇంకా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా హోదా రాలేదని అంటోంది. ప్రస్తుతం మిత్రపక్షం బీజేపీకి అవకాశం ఇవ్వడంతో జనసేన బరిలో లేదని. దీంతో గాజు గ్లాసు గుర్తును తమకు కేటాయించారాని నవతరం పార్టీ నేతలు చెబుతున్నారు. నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్‌ ఇప్పటికే గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు.

    తాజా వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది బీజేపీ-జనసేన బృందం. గతంలోనే జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిందని.. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు ఇస్తోందని.. అంటే బరిలో ఉన్నట్టే అర్థమని.. ఇలాంటి సమయంలో జనసేన గుర్తు వేరే పార్టీకి ఎలా కేటాయిస్తారు అంటూ ఎన్నికల సంఘానికి బీజేపీ-జనసేన బృందం ఫిర్యాదు చేసింది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని.. గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని కోరారు.  బీజేపీ-జనసేన బృందంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, సునీల్ దేవ్ దర్, సుజనా చౌదరి, సీఎం రమేష్ తో పాటు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బీజేపీ నేతలు మాత్రం కచ్చితంగా తమకు న్యాయం జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో ఓటమి భయంతోనే అధికార వైసీపీ ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసిన బీజేపీ అభ్యర్థి విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: