హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్.. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ అధినాయకత్వం ఈటల రాజేందర్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటే.. టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవడానికి ఆ పార్టీకి ఆయన ఒక అస్త్రంగా ఉపయోగపడతారని రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే హుజూరాబాద్‌లో విజయం సాధించిన ఈటల రాజేందర్‌ను కేవలం ఓ ఎమ్మెల్యే పదవికి పరిమితం చేయకుండా.. ఆయనకు బీజేపీ నాయకత్వం కీలకమైన బాధ్యతలు ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో బీజేపీ దగ్గర పలు ఆప్షన్లు ఉన్నాయని.. అందులో ప్రధానమైనది ఆయనను రాష్ట్రంలో క్యాంపెనింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించడం అని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
పార్టీలో క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్నవాళ్లు.. ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తుంటారు. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ను టార్గెట్ చేసే విషయంలో ఈటల రాజేందర్ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అయితే ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి.. ప్రస్తుతం ఉన్న నాయకులను తక్కువ చేయడం వల్ల మరిన్ని ఇబ్బందులు వస్తాయని ఆ పార్టీ హైకమాండ్ యోచిస్తోంది. అందుకే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలని అనుకుంటోందని.. అందుకే ఆయనకు రాష్ట్ర పార్టీ క్యాంపెనింగ్ బాధ్యతలు ఇవ్వాలని భావిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ బీజేపీలో ఇప్పుడున్న పలువురు నేతలు కీలకంగా మారుతున్నారని.. వారితో పాటు ఈటల రాజేందర్ కూడా భవిష్యత్తులో మరింత ముఖ్యనేతగా మారతారని టాక్. బీజేపీలో ఈటల రాజేందర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ అనుకోవడం వెనుక మరో కారణం కూడా ఉంది. టీఆర్ఎస్లో రెండు దశాబ్దాల పాటు ఉన్న ఈటల రాజేందర్‌కు ముఖ్యనేతలు సహా అన్ని స్థాయిల్లోని నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. వారిని ఆయన బీజేపీలోకి తీసుకురావాలంటే.. ముందుగా ఆయనకు కీలకమైన బాధ్యతలు, పదవి ఇవ్వాల్సి ఉంటుందని బీజేపీ నాయకత్వం ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం.
ఇక టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్న ఈటల రాజేందర్ కూడా క్యాంపెనింగ్ కమిటీ బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో అనుకోని విధంగా టీఆర్ఎస్పై ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్.. కాషాయ పార్టీలో ఎలాంటి కీలక బాధ్యతలు దక్కబోతున్నాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.