హోమ్ /వార్తలు /రాజకీయం /

"ఎన్టీఆర్ మహానాయకుడు" ఎఫెక్ట్... ఏపీ మాజీ సీఎంపై కన్నేసిన బీజేపీ

"ఎన్టీఆర్ మహానాయకుడు" ఎఫెక్ట్... ఏపీ మాజీ సీఎంపై కన్నేసిన బీజేపీ

నాదెండ్ల భాస్కర్ రావు

నాదెండ్ల భాస్కర్ రావు

మహానాయకుడు సినిమాలతో తనను విలన్‌గా చూపించడంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఒకరు ఆయనతో చర్చలు జరపడంతో... నాదెండ్ల బీజేపీలోకి వెళ్లి టీడీపీకి కౌంటర్ ఇస్తారేమో అనే ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...

    ఎన్నికల సమీపిస్తున్న వేళ... నేతలు పార్టీలు మారడం సహజం. అయితే ఎన్నికల్లో ప్రభావం చూపించే నాయకులు... బరిలో నిలిచి గెలిచే నాయకులను పార్టీల్లో చేర్చుకునేందుకే రాజకీయ పార్టీలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాయి. అందుకు భిన్నంగా బీజేపీ మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రితో సమాలోచనలు జరపడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీ మాజీముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును బీజేపీలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్... ఆయనతో సమావేశమయ్యారు.


    మంగళవారం నాదెండ్ల ఇంటికి వెళ్లి ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై 2 గంటలపాటు చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాని మోదీ పనితీరుపైనా చర్చించారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా నాదెండ్ల ను బీజేపీలోకి లక్ష్మణ్‌ ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన నాదెండ్ల ఆలోచించి చెబుతానని అన్నట్టు సమాచారం. అయితే ఉన్నట్టుండి నాదెండ్లను తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేయడం వెనుక అసలు టార్గెట్ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ అయిన మహానాయకుడు సినిమాలో నాదెండ్ల భాస్కర్‌రావును విలన్‌గా చూపించారు. దీనిపై నాదెండ్ల భాస్కర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


    అయితే రాబోయే ఎన్నికల సందర్భంగా నాదెండ్ల భాస్కర్ రావును ప్రచారంలోకి దింపి చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ వ్యూహరచన చేసిందనే టాక్ వినిపిస్తోంది. తాను ఎన్టీఆర్‌కు చేసింది ద్రోహమైతే... చంద్రబాబునాయుడు చేసింది ఏమిటని నాదెండ్లతో చెప్పించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సమాచారం. మహానాయకుడు సినిమాతో ఈ తరం ముందు తనను విలన్‌గా చూపించిన టీడీపీ, చంద్రబాబునాయుడుపై రివెంజ్ తీర్చుకునేందుకు నాదెండ్ల కూడా ఎదురుచూస్తున్నారని టాక్. అయితే ప్రస్తుతం తన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన తరపున బరిలో ఉండటంతో... నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

    First published:

    Tags: Andhra Pradesh, Bjp, Chandrababu naidu, Nadendla Bhaskara Rao, NTR Mahanayakudu, Tdp