Home /News /politics /

BJP HIGH COMMAND SOCIAL ENGINEERING PLAN BEHIND PRAMOTING DK ARUNA AS VICE PRESIDENTMU

తెలంగాణాలో బీజేపీ సోషల్ ఇంజినీరింగ్.. డీకే అరుణ నియామకం అందుకేనా.. ?

డీకే అరుణ

డీకే అరుణ

Bjp Social Engineering in Telangana: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రకటించిన జెపి నడ్డా టీమ్ లో తెలంగాణకు చెందిన డీకే అరుణకు ప్రత్యేక స్థానం కల్పించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అరుణకు ప్రత్యేక స్థానం కల్పించడంతో రాష్ట్రంలో కీలకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చేరువ కావొచ్చనే అభిప్రాయంతో బీజేపీ అధిష్టానం పావులు కదుపుతుంది.

ఇంకా చదవండి ...
 • News18
 • Last Updated :


  తెలంగాణలో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. అందుకోసం ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచి సత్తా చాటిన కమలనాథులు.. ఇక్కడ ఎదగడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అంతేగాక బీజేపీ ఉత్తరాది పార్టీ అనే అపప్రదను తొలగించుకోవడానికి కూడా తెలంగాణలో అధికారంలోకి రావడం బీజేపీకి ఆవశ్యకం. ఇది గుర్తించిన బీజేపీ అధినాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రకటించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా టీమ్ లో తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలు డికె అరుణకు ప్రత్యేక స్థానం కల్పించారు. ఆమెను పార్టీ జాతీయ ఉపాద్యక్షురాలిగా నియమించారు.
  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అరుణకు పదోన్నతి కల్పించడం.. ఏపీలోనూ బలమైన సామాజిక వర్గానికి చెందిన పురందరీశ్వరికి మంచి పదవే కట్టబెట్టడం వెనుక బీజేపీ భారీ వ్యూహామే రచించందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బలమైన సామాజికవర్గాల్లో రెడ్డి వర్గానికి ప్రత్యేకస్థానం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలామంది రెడ్డి లీడర్లను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. పార్టీలో కూడా వారికి సముచిత స్థానాన్ని కల్పించి ఆ వర్గానికి చెందిన ఓట్లన్నీ తనవైపునకు తిప్పుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ కు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న ఈ వర్గం తదనంతరం టీఆర్ఎస్ కు షిఫ్ట్ అయినా.. కొద్దికాలంగా ఆ వర్గానికి చెందిన లీడర్ల వైఖరిలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. దీనినే బీజేపీ పసిగట్టినట్టు తెలుస్తున్నది. తెలంగాణలోని పల్లెల్లో ఇప్పటికీ పదవి ఉన్నా.. లేకున్నా.. రెడ్డి వర్గానికి ఉండే పలుకుబడి అలాగే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలో ఇదే వర్గానికి చెందిన నేత కావడం అరుణకు, బీజేపీకి కలిసొచ్చే అంశం. అరుణ ద్వారా మరికొంత మంది ఆ వర్గానికి చెందిన లీడర్లకు, ఇతర పార్టీల్లోని కార్యకర్తలకు గాలం వేసే విధంగా బీజేపీ స్కెచ్ వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
  బీజేపీలోకి రాకముందు అరుణ దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో ఉన్నారు. అంతకుముందు ఆమెకు ఆరెస్సెస్ నుంచి గానీ, దానికి సంబంధించిన అనుబంధ సంస్థల నుంచి గానీ సంబంధాలు లేవు. కానీ గత ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. ఆమె రాకతో మహబూబ్ నగర్ లో బీజేపీకి ప్రాతినిథ్యం. ఓట్ల శాతం కూడా భారీగా పెరిగింది. రెడ్డి సామాజిక వర్గానికి గాలం వేయడంతో పాటు ఇలాంటి పదోన్నతుల వల్ల రాష్ట్రం మొత్తం విస్తరించాలని కూడా బీజేపీ భావిస్తోంది. అంతేగాక మిగతా పార్టీలలోని నిరాశవాదులకు గాలం వేసి.. వారికి మంచి పదవులు ఇయ్యడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సంసిద్ధంగా ఉంచాలనే వ్యూహంలో బీజేపీ అధిష్టానం ఉంది. అరుణతో పాటు ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కు ఓబీసీ మోర్చా చైర్మెన్ గా నియమించడం ద్వారా బీసీల ఓట్లను కొల్లగొట్టడానికి స్కెచ్ లు వేస్తున్నది.
  అయితే అరుణను జాతీయ ఉపాధ్యక్ష పదవిలో నియమించగానే బీజేపీ తక్షణమే అధికారంలోకి రావడం అత్యాశే అని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అరుణకు సరైన గౌరవం దక్కలేదనీ, తాము మాత్రం జాతీయ స్థాయిలో పదవిని ఇచ్చామని స్థానిక నేతలు చెబుతున్నా.. దాని ప్రభావం ఇక్కడి రాజకీయాల మీద పెద్దగా ఉండబోదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు టి. లక్ష్మినారాయణ అన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకూ బలహీనపడుతున్నందున ఏర్పడుతున్న గ్యాప్ ను భర్తీ చేయడానికి కమలనాథులు ఉండొచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటినుంచే అన్నింటికి సంసిద్ధంగా ఉంటూ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వడానికి బీజేపీ అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తున్నది.
  Published by:Srinivas Munigala
  First published:

  Tags: DK Aruna, Telangana bjp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు