BJP HIGH COMMAND SHOCK TO TELANGANA CM KCR REGARDING BANDI SANJAY ARREST AFTER SITUATION AK
Telangana: KCRకు బీజేపీ గట్టి షాక్.. ఈ రేంజ్ రియాక్షన్ ఊహించలేదా ?
అమిత్ షా, కేసీఆర్ (ఫైల్ ఫోటో)
Telangana BJP: నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ బండి సంజయ్ అరెస్ట్ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఈ స్థాయిలో రియాక్షన్ ఉంటుందని ఊహించలేదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా ఇక్కడ బీజేపీ దూకుడు పెంచడమే. కొంతకాలంగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా మారుతున్నట్టు గమనించిన బీజేపీ.. అందివచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవద్దని డిసైడయ్యింది. మరోవైపు బీజేపీ టార్గెట్‌గా వ్యూహాలను రచిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రాష్ట్రంలో కమలం పార్టీకి చెక్ పెట్టేందుకు తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బండి సంజయ్ అరెస్ట్ తరువాత రాష్ట్రంలో తలెత్తిన పరిణామాలు బట్టి చూస్తే.. బీజేపీ నాయకత్వం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్ ఇచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రస్థాయిలో నేతల అరెస్టులను ఆయా పార్టీలకు చెందిన జాతీయ నేతలు పెద్దగా పట్టించుకోరు.
ఒకవేళ పట్టించుకున్నా.. కేవలం ఆ ఘటనలను ఖండించి ఊరుకుంటారు. కానీ బీజేపీ మాత్రం ఇందుకు భిన్నంగా ముందుకు సాగుతోంది. స్వయంగా ఆ పార్టీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా.. బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో జేపీ నడ్డా పాల్గొనాల్సిన కార్యక్రమం వేరే ఉంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో జేపీ నడ్డా స్వయంగా నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఏకంగా జేపీ నడ్డా లాంటి జాతీయ నాయకుడు రంగంలోకి దిగడం బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహానిస్తోంది.
నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ బండి సంజయ్ అరెస్ట్ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఈ స్థాయిలో రియాక్షన్ ఉంటుందని ఊహించలేదని.. ఒక రకంగా ఈ విషయంలో తమ పార్టీ అధినాయకత్వం వ్యవహరించిన తీరు ఆయనకు షాక్ ఇచ్చినట్టే భావించాల్సి ఉంటుందని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. బండి సంజయ్ విషయంలో వ్యవహరించిన విధంగా జేపీ నడ్డా విషయంలోనూ వ్యవహరిస్తే.. ఆ తరువాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయని తెలంగాణ ప్రభుత్వం ఊహించిందని.. అందుకే జేపీ నడ్డా విషయంలో అతిగా నిబంధనలు విధించకుండా ఆయన నిరసన కార్యక్రమానికి అనుమతి ఇచ్చి ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ తరువాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీజేపీకి ఏ రకంగా కౌంటర్ ఇస్తారనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. బీజేపీ దూకుడుకు చెక్ చెప్పాలంటే స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీకి ఎదుర్కొనేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తుంటే.. ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.