BJP HIGH COMMAND NARENDRA MODI AMIT SHAH FOCUS ON TELANGANA WHILE SONIA GANDHI RAHUL GANDHI IGNORES AK
Telangana: జెట్ స్పీడ్‌గా బీజేపీ.. కన్నెత్తి చూడని కాంగ్రెస్.. తెలంగాణలో భిన్న పరిస్థితి
ప్రతీకాత్మక చిత్రం
Telangana Politics: తెలంగాణలో నిరసనలకు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డికి తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఆయనను పలుసార్లు హౌస్ అరెస్ట్ చేశారు.
ప్రజలను ఆకట్టుకునేలా రాజకీయం చేయాలంటే అందుకోసం ఎంతో కొంత శ్రమించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తరువాత కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. బీజేపీ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ చేయడం ఇందుకు ఒక కారణం కాగా.. కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణను అంతగా పట్టించుకోకపోవడం ఇందుకు మరో కారణమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేవలం టీపీసీసీ చీఫ్‌ను మార్చడం, ఇతర నాయకులను కొత్త పోస్టుల్లో నియమించి చేతులు దులుపుకోవడం మినహాయిస్తే.. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నాలు కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా చేయడం లేదనే వాదన ఉంది.
ఇందుకు తాజాగా జరిగిన పరిణామాలను కొందరు ఉదహరిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో నిరసనలకు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డికి తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఆయనను పలుసార్లు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ కానీ, ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు కానీ ఈ విషయం గురించి పట్టించుకోలేదు. అయితే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను ఇదే రకంగా తెలంగాణ పోలీసులు నిలువరించగా... ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది.
నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ(File)
బండి సంజయ్‌ను పరామర్శించడంతో.. పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పింది. ఏకంగా ఆ పార్టీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చారు. దీంతో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలను ఇబ్బందిపెడితే.. వారికి అండగా తాము ఉంటామనే ధైర్యాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం వారికి కల్పించిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మాత్రం రాష్ట్రంలోని పార్టీని, కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ బలపడటానికి, కాంగ్రెస్ బలహీనపడటానికి ఇది కూడా ఒక కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవాల్సింది పోయి ఈ రకంగా వ్యవహరించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందనే చర్చ సాగుతోంది. బీజేపీ తరహాలో కాకపోయినా.. కనీసం రాష్ట్రస్థాయిలో నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు సమయం కేటాయించకపోవడం ఆ పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపించే విధంగా మారిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో బీజేపీ దూకుడు ఒకలా ఉంటే.. కాంగ్రెస్ తీరు మరోలా కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.