Eetala Rajender: ఈటల రాజేందర్‌కు బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్.. పార్టీలో చేరిక ఎప్పుడంటే..

Eetala Rajender :స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించనున్న ఈటల ..పదకొండు గంటలకు ముహుర్తం ఫిక్స్

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అదే రోజున ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అంతకంటే ముందే ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరతారని సమాచారం.

  • Share this:
    మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవితవ్యం ఏంటి? ఆయన బీజేపీలో చేరుతారా? కొత్త పార్టీ పెడతారా? లేదంటే కేసీఆర్ వ్యతిరేక శక్తులతో కలిసి ఐక్య వేదికను ఏర్పాటు చేస్తారా..? రెండు మూడు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో దీని గురించే హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ఐతే అన్ని విధాలుగా ఆలోచించుకున్న తర్వాత బీజేపీలో చేరేందుకే ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నారు. పార్టీలో ఆయన చేరికకు బీజేపీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈటల రాజేందర్ వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర ముఖ్య నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం వర్చువల్ భేటీలో చర్చించారు. ఆ భేటీ అనంతరం బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు జేపీ నడ్డా పచ్చజెండా ఊపారు.

    ఐతే ఆయన పార్టీలో ఎప్పుడు చేరతారన్నది ఒకటి రెండు రోజుల్లో తెలియనుంది. పార్టీలో చేరే తేదీని బీజేపీ ఖరారు చేస్తుంది. బీజేపీ హైకమాండ్ ఆ తేదీని ప్రకటించిన తర్వాత ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్తారు. అనంతరం జేపీ నడ్డా, హోమంత్రి అమిత్ షా సమక్షలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని సమాచారం. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అదే రోజున ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అంతకంటే ముందే ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరతారని సమాచారం.

    గురువారం శామీర్‌పేట్‌లోని ఈటల నివాసంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత ప్రొ. కోదండరామ్ ఆయనతో సమావేశమయ్యారు. ఈటల బీజేపీలో చేరతారని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో వీరు ఆయన్ను కలిశారు. బీజేపీలో చేరవద్దని.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఐక్య వేదికను ఏర్పాటు చేద్దామని కోరారు. చివరి ప్రయత్నంగా చర్చలు జరిపారు. ఈటలకు నైతికంగా మద్దతు తెలిపేందుకే ఇక్కడకు వచ్చామని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఒకవేళ నిజంగానే ఈటల తప్పు చేసి ఉంటే.. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈటలపై జరిగిన రాజకీయ దాడిని ఆత్మగౌరవ దాడిగా అభివర్ణించారు ప్రొ. కోదండరామ్.


    ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత.. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ పోటీచేయబోడని ప్రచారం జరుగుతోంది. ఆయనకు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తుందని.. అనంతరం కేంద్రమంత్రి పదవి ఇవ్వనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్‌లో ఈటల సతీమణి జమున పోటీ చేస్తారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published: