రాజకీయాలు ఎప్పటికప్పడు మారుతుంటాయి. కొన్నిసార్లు రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఏపీ, తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం అలాగే ఉన్నట్టు కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో కొద్దిరోజుల క్రితం ఉప ఎన్నికలు జరిగాయి. ఏపీలో బద్వేల్, తెలంగాణలో హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి. బద్వేల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక రాగా.. తెలంగాణలో మాజీమంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగ్గా.. మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి. విచిత్రం ఏమిటంటే.. అటు ఏపీలో, ఇటు తెలంగాణలోని అధికార పార్టీలకు పోటీగా నిలిచింది బీజేపీ మాత్రమే.
ఏపీలోని బద్వేల్ స్థానానికి పోటీ చేయకుండా టీడీపీ దూరంగా ఉంది. అయితే ఇక్కడ పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. అయితే వైసీపీ మాత్రం తమ ప్రత్యర్థి బీజేపీ అని భావించింది. బీజేపీకి టీడీపీ లోపాయికారిగా సహకరించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది.
ఇక తెలంగాణలోని హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ తరపున మళ్లీ బరిలోకి దిగారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈటలను ఓడించేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఇలాంటి వాటిలో ఆరితేరిన మంత్రి హరీశ్ రావును రంగంలోకి దింపి మంత్రాంగం నడిపించారు.
కానీ ఫలితం మాత్రం టీఆర్ఎస్కు మింగుడుపడని విధంగా వచ్చింది. ఎంత ప్రయత్నించినా.. ఈటల రాజేందర్‌ను ఓడించడం టీఆర్ఎస్ వల్ల కాలేదు. అధికార పార్టీని ఎదుర్కొని ఏకంగా 23,865 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి టీఆర్ఎస్కు ఊహించని షాక్ ఇచ్చారు. ఇది ఈటల రాజేందర్ గెలుపు అని.. ఇందులో బీజేపీ పాత్ర ఏమీ లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నా.. బీజేపీ మాత్రం ఈటల రాజేందర్ ద్వారా తాము టీఆర్ఎస్ను ఓడించామని ప్రకటించుకుంటోంది.
KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?
Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘ముందస్తు’ మాటల వెనుక మాస్టర్ ప్లాన్ ?
తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్కు షాక్ ఇవ్వగా.. ఏపీలో మాత్రం అధికార వైసీపీ బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆ పార్టీకి అందనంత ఎత్తులో నిలిచింది. ఏకంగా 90 వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి.. బీజేపీ పోటీని నామమాత్రం చేసింది. అయితే ఏపీ, తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలకు పోటీ తామే అని ప్రకటించుకున్న బీజేపీ.. తెలంగాణలో టీఆర్ఎస్కు షాక్ ఇవ్వగా.. ఏపీలో మాత్రం వైసీపీ దూకుడు ముందు తేలిపోయింది. అలా జాతీయ పార్టీ అయిన బీజేపీ.. ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా వార్తల్లో నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Bjp, CM KCR