ఆంధ్రప్రదేశ్ లో బలపడేందుకు భారతీయ జనతాపార్టీ చాపకింద నీరులా పావులు కదుపుతోంది. జమిలి ఎన్నిలక గురించి ముందే తెలిసినటుగా సోమూవీర్రాజు వరుసపెట్టి జిల్లా పర్యటన చేస్తూ కండువాలు కప్పుతున్నారు. ఇప్పటి వరకు పేరున్న నేతలు పార్టీలోకి రాకపోయినా కార్యకర్తలకు పూర్తి భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర బీజేపీలో దూకుడు పెరిగింది. జమిలిఎన్నికలే లక్ష్యంగా నాయకులను కాదని కార్యకర్తలపై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. జిల్లాల వారీగా పర్యటిస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకులు ఇతర పార్టీల్లోంచి వస్తామన్న వారిని కాదని ప్రస్తుతానికి కార్యకర్తలు మాత్రం ఆహ్వానిస్తున్నారు. ఓ 500 మంది పార్టీలో చేరుతుంటే స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజే రంగంలోకి దిగి పార్టీ కండువాలు కప్పేస్తున్నారు. మీ ఫ్యూచర్ మా బాధ్యత అంటూ వారికి భరోసా ఇస్తున్నారు.
అదే కారణమా..?
ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించినప్పటి స్పీడ్ పెంచారు. తొలుత హిందూ దేవాలయాల రక్షణ అంటూ చేసిన ఆందోళనలో సక్సెస్ అయినా.! కార్యకర్తలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. కోర్ కమిటీ సమావేశాలు... రాష్ట్ర, జిల్లా స్ధాయి కమిటీల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవడంతో రూటు మార్చారు. పార్టీలో చేరికలపై దృష్టి సారించాలని జిల్లా ఇన్ ఛార్జులకు ఆదేశాలు జారీ చేశారు. ఫైనల్ గా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రస్తుతం రాయలసీమ పర్యటిస్తున్న సోమూ వీర్రాజు పార్టీ లోకి వస్తున్న ప్రతిఒక్కరిని కండువా కప్పి మరీ ఆహ్వానిస్తూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు సవాల్ విసురుతున్నారు. అలాగే పర్యటనలో భాగంగా టీడీపీ, వైసీపీలపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
త్వరలో మరిన్ని చేరికలు.?
ప్రస్తుతానికి కార్యకర్తల బలాన్ని పెంచుకుంటున్న బీజేపీకి నెక్స్ట్ టార్గెట్ ఇతర పార్టీల్లోని ప్రధాన నాయకులే అనే ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత ఇతర పార్టీల్లోంచి బీజేపీ వైపు చూసిన కొందరు నేతలు ఇప్పటికీ బీజేపీతో టచ్ లోనే ఉండటంతో తిరుపతి ఉప ఎన్నికలు జరిగేలోపే పార్టీలోకి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. ఒకవేళ రెండవ స్ధానంలో నిలిచినా.. 2024 ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ ను తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారానికి దింపి ఇతర పార్టీల్లోంచి వచ్చిన వారిని తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ఇప్పటికే సోమూ వీర్రాజు జిల్లాల పర్యటనలో ఆయా ప్రాంతాల సమస్యలపై గత టీడీపీ ప్రభుత్వాన్ని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. కాని కార్యకర్తల లోటును పూడిస్తేనే బిజెపి బలోపేతం చెందే అవకాశం ఉందని గ్రహించినట్టున్నారు. అనుకున్న లక్ష్యంగా రాయలసీమలో పర్యటిస్తూ మరింత మందిని పార్టీలోకి అహ్వానిస్తున్నారు. ఏది మైనప్పటికీ గతంలో ఆంధ్రాలో స్తబ్ధుగా ఉన్న బీజేపీ.. ప్రస్తుతం తన మార్క్ చూపేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. మరి సోము స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:December 23, 2020, 13:24 IST