గ్రేటర్ హైదరాబాద్ లక్ష్యంగా బీజేపీ పావులు.. వ్యూహాత్మక ఎత్తుగడలతో..

బీజేపీ పెద్దలు గ్రేటర్ హైదరాబాద్‌పై దృష్టి సారించారా? హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారా? అంటే.. తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 19, 2019, 6:05 PM IST
గ్రేటర్ హైదరాబాద్ లక్ష్యంగా బీజేపీ పావులు.. వ్యూహాత్మక ఎత్తుగడలతో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం కూడా ఊహించని విధంగా తెలంగాణ నుంచి ఆ పార్టీకి నాలుగు సీట్లు వచ్చాయి. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ సహా సికింద్రాబాద్ స్థానాలను కైవసం చేసుకుందా పార్టీ. జంట నగరాల పరిధిలో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఆ పార్టీ పటిష్ఠంగానే ఉన్నా.. హైదరాబాద్‌లో కాషాయ పార్టీ పరిస్థితి మరీ ఘోరం. అక్కడ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అప్రతిహత విజయాలు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు గ్రేటర్ హైదరాబాద్‌పై దృష్టి సారించారా? హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారా? అంటే.. తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహారణే.. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా బహిరంగ సభను ఏర్పాటు చేయడం.

వాస్తవానికి, తెలంగాణలో ఎక్కడ కూడా బీజేపీకి బలమైన పునాదులు లేవు. దశాబ్ధ కాలం క్రితం వరకు అక్కడక్కడ కేడర్ ఉన్నా.. టీఆర్‌ఎస్ పార్టీ ఆ కేడర్‌ను ఆకర్షించింది. దాంతో ఉన్న కాస్త బలం కూడా కనుమరుగైంది. ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ ఒకే ఒక్క సీటు.. అది కూడా అతి కష్టం మీద గెలవడంతో బీజేపీ ఆనవాళ్లు మాయమైపోయాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ, లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి ఆ పార్టీ నాలుగు సీట్లు గెలుచుకుంది. అయితే, ఆ సీట్లు మోదీ హవాతోనే వచ్చాయని బల్ల గుద్ది మరీ చెప్పవచ్చు. కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సానుభూతి దక్కినా.. మోదీ గాలిని తక్కువ చేయడం కష్టమే.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో అమిత్ షా పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నం చేశారు. ఆ ప్రభావం అంతగా చూపలేదు. దీంతో బీజేపీ అధిష్ఠానం తన దృష్టిని గ్రేటర్ హైదరాబాద్‌పైకి మరల్చినట్లు సమాచారం. నగర శివారులోని మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ముస్లిం జనాభా దాదాపు 70 శాతం. ఆ ఓట్లు బీజేపీకి పడతాయని ఆశించడం వృథాయే. కానీ.. యూపీలో అవలంభించిన వ్యూహాలతో హైదరాబాద్‌లోనూ పాగా వేసేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ముందుగా గ్రేటర్ మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీజేపీ ఎత్తుగడలు రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయని, కాషాయ పార్టీ బలపడితే తొలుత ప్రభావితం అయ్యేది గులాబీ పార్టీయేనని చెబుతున్నాయి. ఎందుకంటే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మజ్లిస్‌తో పాటు ఎక్కువ ఓటు శాతం ఉన్నది టీఆర్‌ఎస్ పార్టీకే. అందుకే ఆ పార్టీ భయపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఉనికిని కోల్పోతున్నాయని, ఈ తరుణంలో బీజేపీ అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోందని వాదిస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు