BJP DECIDED TO FOCUS MORE ON RESERVED SEATS IN TELANGANA DUE TO PAST EXPERIENCES AK
Telangana: బీజేపీ పక్కా లెక్క.. ఆ స్థానాలపై స్పెషల్ ఫోకస్.. అలా డిసైడయ్యారా ?
అమిత్ షా, బండి సంజయ్(ఫైల్ ఫోటో)
Telangana Bjp: ముందుగా ఈ స్థానాల్లో ఇన్ఛార్జ్లను నియమించిన తరువాత.. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై రాష్ట్ర స్థాయిలో పోరాటం చేయాలని.. అందులో భాగంగా ఈ నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి సారించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోందని సమాచారం.
తెలంగాణలో ఎలాగైనా అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఓ వైపు టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయం పోరాటం చేస్తూనే... ఆ పార్టీని ఎన్నికల్లో ఎదుర్కోవడానికి ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి గతానికి భిన్నంగా ఉంది. ఆ పార్టీ క్రమంగా బలపడుతోంది. కొన్నేళ్లుగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే తమకు అందివచ్చిన అవకాశాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలనే యోచనలో ఉన్న కమలనాథులు ఉన్నారు. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని 60 సీట్లు గెలుచుకోవాలి. అయితే బీజేపీ 70 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుంది.
ఈ క్రమంలో తెలంగాణలోని 31 ఎస్టీ, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలపై ఆ పార్టీ ఇప్పటి నుంచే ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఈ రిజర్వ్డ్ స్థానాల్లో దాదాపు సగం గెలుచుకుంటేనే తమకు తెలంగాణలోని అధికారం దక్కుతుందనే నిర్ణయానికి వచ్చారు కమలం పార్టీ నేతలు. అయితే ఈ నియోజకవర్గాల్లో బీజేపీ అంతగా బలంగా లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఏ రకంగా గెలవాలనే దానిపై ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా ముందుగా ఈ స్థానాల్లో ఇన్ఛార్జ్లను నియమించే యోచనలో తెలంగాణ బీజేపీ ఉందని తెలుస్తోంది.
ఇలా చేయడం వల్ల ఆయా నేతలే వచ్చే ఎన్నికల్లో అక్కడ పోటీ చేయబోయే అభ్యర్థులు అనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వంలో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు సమాచారం. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మెజార్టీ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమించే ప్రక్రియను వేగవంతం చేయాలనే యోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ముందుగా ఈ స్థానాల్లో ఇన్ఛార్జ్లను నియమించిన తరువాత.. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై రాష్ట్ర స్థాయిలో పోరాటం చేయాలని.. అందులో భాగంగా ఈ నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి సారించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోందని సమాచారం. మరోవైపు బీజేపీ నాయకత్వం ఈ విషయంలో నేతల వడపోతల కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసిందని.. నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు పేర్లతో ఓ జాబితాను కూడా రూపొందించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఆ దిశగా గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్టు అర్థమవుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.