BJP CHIEF AMIT SHAH CLARIFIES THAT RAMA MANDIR SHOULD BE CONSTRUCTED IN THE SAME SPOT PS
రామమందిరాన్ని అక్కడే నిర్మించాలి.. బీజేపీ నిర్ణయం అదేనన్న అమిత్ షా
అమిత్ షా(File)
ఎన్నికల సమయంలోనే అయోధ్య రామమందిరం అంశాన్ని తెరమీదకు తీసుకొస్తుందంటూ.. బీజేపీపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు. అదే నిజమే అన్నట్టుగా.. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ చీఫ్ అమిత్‌షా రామమందిర నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ... 2019 పార్లమెంట్ ఎన్నికలకు చేయాల్సిన ప్రచారతీరుపై పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి నేతలతో సమావేశమైన అమిత్ షా.. నాలుగున్నరేళ్లలో బీజేపీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. రామమందిర నిర్మాణంపై బీజేపీ నిర్ణయాన్ని వెల్లడించారు అమిత్ షా. రామమందిరాన్ని అదే స్థలంలో నిర్మించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణం అత్యద్భుతంగా జరగాలన్నారు. ఆ స్థలాన్నే రామమందిర నిర్మాణం కోసం బీజేపీ కోరిందన్నారు. ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతోందని.. రామమందిరం నిర్మాణం కూడా బీజేపీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేశారని అమిత్ షా చెప్పారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేయడం ద్వారా.. భారత జవాన్ల మరణానికి మోదీ ప్రతీకారం తీర్చుకున్నారని గుర్తు చేశారు. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు మాత్రమే చేయగలిగే సాహసాన్ని భారత ప్రధానిగా మోదీ చేసి చూపించారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ను దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ కృషి చేస్తుందని, అందుకోసం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీనే గెలిపించాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినా... యూపీలో బీజేపీ 74 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమన్నారు.
దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న శత్రుమూకలను రాహుల్ బాబా కంపెనీ సమర్థిస్తోందని అమిత్ షా ఆరోపించారు. చొరబాటుదారులే ఎస్పీ, బీఎస్పీలకు ఓటుబ్యాంకన్నారు. 2019లో అధికారంలోకి రాగానే చొరబాటుదారులను వెళ్లగొడతామని చెప్పారు. కులాల కుంపటితో రగిలిపోయే యూపీని బీజేపీ రక్షించిందని, రాజరికపాలనకు చరమగీతం పాడిందని అమిత్ షా అన్నారు.
Published by:Santhosh Kumar Pyata
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.