2018 ఆసెంబ్లీ ఎన్నికల వరకు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్కు కంచుకోటగా ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో అనుహ్యంగా కారు బోల్తా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన టిఆర్ఎస్ అనుహ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపి స్థానాన్ని కోల్పోయింది. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కూతురైన ఎంపీ కవిత ఓటమి పాలవ్వడం... రాజ్యసభ సభ్యుడు ధర్మాపూరి శ్రీనివాస్ కొడుకు అరవింద్ గెలవడం టీఆర్ఎస్కు భంగపాటుగా మారింది. కవిత ఓటమికి ఎమ్మెల్యేల ఆలసత్వమే కారణమన్న ప్రచారం జరిగింది. తాజాగా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండటంతో ప్రజల నాడి ఎలా వుందనేది ఉత్కంఠగా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి బీజేపీ జెండాను రెపరెపలాడించిన ఇందూరు ప్రజలు ఇప్పుడు ఎవరికి పట్టం కడతారనే అంశం చర్చనీయాంశమవుతోంది.
అయితే నిజామాబాద్ కార్పొరేషన్ గెలుపు బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకే సీఎం కెసిఆర్ అప్పగించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని చెరిపేసుకోవాలని వారంతా భావిస్తున్నారు. 2014 మున్సిపల్ ఎన్నికల్లో పది డివిజన్లు మాత్రమే గెలుచుకొని ఎంఐఎంతో కలిసి నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని గులాబీ పార్టీ దక్కించుకుంది ఈసారి ఒంటరిగానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.
నిజామాబాద్ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజల్ ఉన్నాయి. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరిధిలో యాభై డివిజన్లు, రూరల్ మ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరిధిలో ఎనిమిది డివిజన్లు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిధిలో రెండు డివిజన్లు ఉన్నాయి.అయితే గెలుపు బాధ్యతల్లో ప్రధాన పాత్ర బిగాలపై ఉన్నా... ముగ్గురు ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు నిజామాబాద్ కార్పొరేషన్‌ను సొంతం చేసుకోవాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం సీనియర్ నాయకుడైన తన తండ్రి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సహకారం తీసుకుంటున్నారు. డీఎస్ అనుచరులంతా బీజేపీలో చేరడంతో ఆ బలం కూడా కాషాయం పార్టీకి కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్నారు.దీంతో నిజామాబాద్ కార్పొరేషన్ పోరు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు అన్నట్టుగా మారిందని చర్చ జరుగుతోంది.
పి.మహేందర్, న్యూస్ 18 ప్రతినిధి
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.