బీజేపీ - టీఆర్ఎస్ మధ్య గ్యాప్ పెరుగుతోందా... మే 23 తర్వాత కొత్త రాజకీయం తెరపైకి వస్తుందా...

నరేంద్ర మోదీ, కేసీఆర్

Lok Sabha Election 2019 : రైతుల విషయంలో మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నామినేషన్లు వేయించిందని భావిస్తున్న బీజేపీ... ఇంటర్ ఫలితాల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయాలని చూస్తోందా...

  • Share this:
బీజేపీ - టీఆర్ఎస్ మధ్య ఎలాంటి పొత్తూ లేదనీ, తమ మధ్య ఎలాంటి ఒప్పందాలూ లేవని రెండు పార్టీల నేతలూ చెబుతున్నా... ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. కమలం, కారు మధ్య అనధికారిక పొత్తు ఉందని ఎక్కువ మంది ప్రజలు నమ్ముతున్నారు. ఆ రెండు పార్టీలు తీసుకునే నిర్ణయాలు కూడా... అందుకు తగ్గట్టుగానే ఉంటుండటంతో... పొత్తు నిజమేననే అభిప్రాయం నానాటికీ పెరుగుతూ వచ్చింది. అలాంటిది... తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిశాక సీన్ మారినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా పసుపు బోర్డు కోసం ధర్నా చేస్తున్న నిజామాబాద్ రైతులు... ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి నుంచీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. వాటిలో ఒక్కదాన్నే అధికారులు ఆమోదించినప్పటికీ... అసలా రైతుల్ని రెచ్చగొట్టి, నామినేషన్లు వేయించింది టీఆర్ఎస్సే అని భావిస్తున్నారట కమలనాథులు. పసుపు బోర్డు ఏర్పాటు కేంద్రం చేతుల్లో ఉందనీ, తాము చేయగలిగినంత ప్రయత్నం చేసినా, కేంద్రం స్పందించలేదన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత... రైతుల్ని వారణాసిలో పోటీ చేయమని సలహా ఇచ్చారని కమలనాథులు ఆరోపిస్తున్నారు. ఇలా ఈ అంశం రెండు పార్టీల చిచ్చు పెట్టినట్లు కనిపిస్తోంది.

తమపైనే కత్తి దూస్తున్న టీఆర్ఎస్‌కి చెక్ పెట్టాలని భావించిన బీజేపీ అగ్రనాయకత్వం... రాష్ట్ర బీజేపీ వర్గానికి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారనీ ఇకపై ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని పిలుపిచ్చారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇంటర్ ఫలితాల్లో తలెత్తిన అవకతవకల్ని క్యాష్ చేసుకుంటూ బీజేపీ సడెన్‌గా ధర్నాలకు దిగడం వెనక హైకమాండ్ నుంచీ సడెన్‌గా వచ్చిన ఆదేశాలే కారణం అంటూ ప్రచారం జరుగుతోంది. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరాహార దీక్షకు కూడా దిగాలని బీజేపీ తీసుకున్న నిర్ణయంతో ఇకపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ ఒప్పందాలు, సంబంధాలూ లేనట్లేనని అంటున్నారు విశ్లేషకులు.


బీజేపీకి టీఆర్ఎస్ దూరం జరగడానికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా కమలదళం గ్రాఫ్ పడిపోతోందనీ, తమ గ్రాఫ్ పెరుగుతోందని టీఆర్ఎస్ అధినాయకత్వం భావించడమే కారణమని తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్... ఎన్నికల ఫలితాలు వచ్చాక... అప్పటి పరిస్థితులను బట్టీ... ఎవరితో కలవాలి, ఎవర్ని దూరం పెట్టాలనే అంశంపై ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఫెడరల్ ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోతే... అవసరమైతే ప్రత్యామ్నాయంగా యూపీఏ పక్షాలతో కలిసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారనీ, అందుకే బీజేపీకి దూరం జరుగుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

ప్రస్తుతానికి కేంద్రంలో కీలక మంత్రి పదవుల్ని రాబట్టడం ద్వారా... తెలంగాణకు ఎక్కువ ప్రయోజనాల్ని కల్పించుకుంటూ... తమ డిమాండ్లు నెరవేర్చుకుంటూ... వచ్చే ఐదేళ్లలో జాతీయ స్థాయిలో టీఆర్ఎస్‌ను బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్... అందుకు అవసరమైన అన్ని మార్గాల్నీ అన్వేషిస్తున్నారని తెలిసింది. ఆ క్రమంలోనే పూర్తిగా బీజేపీ పక్షంగా ముద్రపడిపోకుండా... ఫలితాలు వచ్చే సమయానికి తాము ఎవరిపక్షానైనా నిలవగలమనే సంకేతాలు పంపేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. అందువల్ల ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల్ని బట్టీ... ఏ పార్టీలు ఎటువైపు ఉంటాయన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

గిన్నీస్‌బుక్ ఎక్కిన క్రికెటర్ అరెస్ట్... ట్రూకాలర్ యాప్‌తో లక్షలు కాజేస్తూ...

సీసీ కెమెరాను కొట్టేసి... మరో సీసీ కెమెరాకు దొరికిన దొంగ...

ఎయిర్‌హోస్టెస్‌ చేతులు తడుముతూ వెధవ్వేషాలు... బుక్కైన హైదరాబాద్ వ్యాపారి

Cyclone Fani : రేపు సాయంత్రం వరకూ ఫొణి తుఫాను ప్రభావం... నాగాలాండ్, మణిపూర్‌కీ పొంచివున్న ముప్పు...
First published: