బీజేపీతో పవన్ కళ్యాణ్... ఎవరి లెక్క ఏంటి ?

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వల్ల... ఆ పార్టీతో కలిసి ముందుకు సాగడం వల్ల జనసేనకు రాజకీయ ప్రయోజనం ఉంటుందని పవన్ కళ్యాణ్ గట్టిగానే నమ్ముతున్నారని సమాచారం.

news18-telugu
Updated: January 14, 2020, 7:49 PM IST
బీజేపీతో పవన్ కళ్యాణ్... ఎవరి లెక్క ఏంటి ?
ప్రతికాత్మక చిత్రం
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా బీజేపీతో కలిసి పని చేయడం దాదాపు ఖాయమైంది. బీజేపీతో కలిసి పవన్ ఏయే అంశాలపై రాజకీయ పోరాటం చేస్తారనే దానిపై ఇంకా ఓ క్లారిటీ రాకపోయినప్పటికీ... మొదటగా ఈ రెండు పార్టీలు కలిసి అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతుగా పోరాటం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బీజేపీతో పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ విషయంలో ఎవరికి ఎవరి వల్ల లాభం అనే అంశంపై అప్పుడే చర్చ మొదలైంది. ఏపీలో అత్యంత బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదనే నిర్ణయానికి వచ్చిన పవన్ కళ్యాణ్... ఈ విషయంలో బీజేపీతో కలిసి ముందుకు సాగడమే మంచిదని అనుకుంటున్నారని తెలుస్తోంది.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వల్ల... ఆ పార్టీతో కలిసి ముందుకు సాగడం వల్ల జనసేనకు రాజకీయ ప్రయోజనం ఉంటుందని పవన్ కళ్యాణ్ గట్టిగానే నమ్ముతున్నారని సమాచారం. ఈ విషయంలో చాలాకాలం క్రితమే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని... ఇప్పుడు ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయని పలువురు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వంటి చరిష్మా ఉన్న నేతను ముందుపెట్టి రాజకీయాలు చేయడమే మేలు అని బీజేపీ భావిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

అధికారంలో ఉన్న వైసీపీతో ఉన్న సత్సంబంధాలు మెల్లిమెల్లిగా కట్ చేసుకున్న బీజేపీ... ఎన్నికలకు ముందుకు తమతో విడిపోయిన టీడీపీతో కలిసి పని చేసేందుకు సుముఖంగా లేదు. అయితే సొంతంగా తమ పార్టీ ప్రజల్లోకి వెళ్లి వారిని ఆకట్టుకునే బలమైన నాయకుడు లేకపోవడంతో... పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని బీజేపీ భావిస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేనతో కలిసి వెళ్లడం ద్వారా ఆ పార్టీ ఓటు బ్యాంకు తమకు ఎంతో కొంత కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేసుకుని ఉండొచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి బీజేపీ, జనసేన రాజకీయ కలయిక విషయంలో ఎవరి లెక్కలు వారికి ఉన్నట్టు కనిపిస్తోంది.First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>