Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేశాయి. విజయదశమి నుంచి రెండు పార్టీలు బరిలోకి దిగనున్నాయి. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బెంగళూరు ఐటి నిపుణులతో నిర్వహించిన వెబినార్‌లో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. జనసేన పార్టీ బలోపేతం - దేశాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర అనే అంశంపై బెంగళూరు ఐటీ టీం సభ్యులు నాదెండ్ల మనోహర్‌తో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘ప్రజా గొంతుకై నిలబడాలి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని స్థాపించిన జనసేన పార్టీని ఆదిలోనే తొక్కేయాలని రెండు బలమైన పార్టీలు ప్రయత్నించాయి. సంబంధం లేకపోయినా ఎన్నికల సమయంలో ఒక పార్టీకి బీ-టీమ్ అంటూ విష ప్రచారం చేశాయి. కొంతమందిని పార్టీలోకి పంపించి ఎన్నికల తర్వాత బయటకు వచ్చి పార్టీపై బురద జల్లే ప్రయత్నం కూడా చేశాయి. అయితే నిస్వార్ధం, నిబద్ధతగా పని చేసే జన సైనికులు, యువత వల్ల ఆ కుతంత్రం విఫలమయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పార్టీ ఈ రోజు బలంగా నిలబడింది అంటే దానికి ప్రధానం కారణం యువతే. కరోనా సమయంలో ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేసింది కూడా యువతే’ అని అన్నారు.
కెరీర్ గా తీసుకుంటే మార్పు తథ్యం
‘ప్రస్తుత రాజకీయాలు వ్యాపారమయం అయ్యాయి. కోట్లు ఉన్నవాడికే సీట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అలాంటివారు గెలిచాక పెట్టిన పెట్టుబడి సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. దీంతో వ్యవస్థల్లో అవినీతి పేరుకుపోతుంది. ఇప్పటికీ రాజస్థాన్, బీహార్ వంటి ప్రాంతాల్లో ఎంపీ సీటుకు రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షలు, ఎమ్మెల్యే స్థానానికి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలు మాత్రమే ఖర్చు చేస్తారు. మన దగ్గర మాత్రం ఒక్కొక్క ఎంపీ సీటుకు రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు. అందుకు భిన్నంగా జనసేన పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు ఎంత పెట్టగలడు అని చూడకుండా పాతికేళ్లు పార్టీతో ప్రయాణం చేయగలడా లేదా అని ఆలోచించి టికెట్ ఇచ్చాం. అలా ఆలోచించాం కాబట్టే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక కండక్టర్ కొడుకు, ఒక వ్యవసాయ కూలీ కొడుకు, సామాన్యులు పోటీ చేయగలిగారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే కొత్త రక్తం రావాలి. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా యువత ఎంచుకోవాలి. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే, ఒక మంచి పార్టీకి పట్టం కడితే వ్యవస్థలో మార్పు వస్తుందని ప్రజల్లో అవగాహన రావాలి. అప్పుడే రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుంది.’ అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా పార్టీ ఆఫీసు
రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో కలిసి ఉమ్మడి కార్యక్రమాలు రూపొందించి ముందుకు వెళతామని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని నాదెండ్ల చెప్పారు. ప్రతి కార్యాలయంలో అవసరమైన సిబ్బందితోపాటు సోషల్ మీడియా ఇంఛార్జులను నియమిస్తామన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:September 05, 2020, 20:29 IST