ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు సంచలన నిర్ణయాలను ఇప్పుడు జాతీయ పార్టీలు కూడా అందిపుచ్చుకుంటున్నాయి. భవిష్యత‌్తులో రాజకీయంగా తమకు మేలు చేయడంతో పాటు గంపగుత్తగా ఓట్లు కురిపిస్తాయని భావిస్తున్న ఈ నిర్ణయాలను అమలు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఓవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు వీటిపై అసంతృప్తిగా ఉన్న వేళ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు సైతం వీటి అమలుకు సిద్దం కావడం ఇప్పుడు సంచలనాలు రేపుతోంది. ఏపీలో నాలుగు నెలల క్రితం అధికారం చేపట్టిన వైఎస్ జగన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. రోజుకో సంచలన నిర్ణయంతో అధికార వర్గాలను, పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని సైతం నివ్వెరపరుస్తున్నారు. అదే సమయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై కేంద్రం ఒకింత అసంతృప్తిగానే ఉన్నట్లు తాజా పరిణామాలను గమనిస్తే అర్ధమవుతోంది. అయినా జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలను తాము కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందన్న భావన జాతీయ పార్టీల్లో సైతం కనిపిస్తోంది. అందుకే జాతీయ స్దాయిలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు జగన్ నిర్ణయాలను పలు రాష్ట్రాల్లో అమలు చేసే పనిలో పడ్డాయి.
జాతీయ పార్టీలు ఆసక్తి చూపుతున్న జగన్ నిర్ణయాల్లో ప్రధానమైనది పరిశ్రమల్లో 75 శాతం స్ధానిక కోటా నిర్ణయం. జగన్ ఈ నిర్ణయం ప్రకటించినప్పుడు విమర్శించిన కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ముందుగా కర్ణాటకలోని బీజేపీ సర్కారు ఈ 75 శాతం కోటా అమలు చేస్తామని ప్రకటించగా.. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఏకంగా 80 శాతం కోటా అమలు చేస్తామని ముందుకొచ్చింది. ఈ నిర్ణయంతో మహారాష్ట్రలో స్ధానికత ఓ ప్రధానాంశంగా పనిచేసే ఎన్నికల పోరులో భారీగా లబ్ది పొందాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే బీజేపీ-శివసేన మహా కూటమి ఏర్పాటుతో ఓట్ల పోరులో వెనుకబడిన కాంగ్రెస్.. స్ధానిక కోటా నిర్ణయాన్ని ఓటర్లలో బలంగా తీసుకెళుతోంది. ఇది ఎంతవరకూ వారికి ప్రయోజనం కల్పిస్తుందో లేదో త్వరలో జరిగే ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. అదే సమయంలో కర్ణాటకలో గతంలో కుల, మత సమీకరణాల ఆధారంగా ఓట్లను చీల్చి తొలిసారి దక్షిణాదిన అధికారం రుచి చూసిన బీజేపీ ఈసారి స్ధానిక అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. యడ్యూరప్ప చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇదే పాచిక విసిరే అవకాశముంది.
బీజేపీ పాలనలో ఉన్న మరో రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ కూడా జగన్ బాటలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష- రద్దు నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ కంటే వేగంగా సమీక్షలు నిర్వహించడమే కాకుండా 650 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలను అక్కడి యోగీ ఆదిత్యనాథ్ సర్కారు రద్దు చేసి పారేసింది. అసలే పీపీఎల సమీక్ష కోసం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై కేంద్రం కస్సుమంటున్న వేళ.. యోగీ సర్కారు ఏకంగా వాటి రద్దు కూడా చేసేయడంపై కేంద్రం సైతం నోరు మెదపడం లేదు. సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుతో దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటుందని, జగన్ తరహాలో మిగతా రాష్ట్రాలు కూడా విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తే దీని అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని కేంద్రం ఇప్పటివరకూ వాదిస్తూ వచ్చింది. కానీ తమ పాలనలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ వంటి కీలక రాష్ట్రంలో యోగీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బీజేపీకి సైతం మింగుడుపడనిదే అవుతుంది. అదే సమయంలో పీపీఏల విషయంలో యోగీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం కేంద్రం వద్ద వాదనకు ఉపయోగించుకునే అవకాశమూ దొరికింది. యోగీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుని వారం రోజులు గడుస్తున్నా.. కేంద్రం స్పందించకపోవడంతో మిగతా రాష్ట్రాలు కూడా అదే బాటలో సాగే అవకాశాలూ లేకపోలేదు.
(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్18)
భారత్ చేతికి రాఫెల్ జెట్.. రాజ్‌నాథ్ ఆయుధ పూజ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, Ap cm ys jagan mohan reddy, AP Congress, Karnataka bjp, Tdp, Uttar pradesh