BJD WILL PLAY A MAJOR ROLE IN GOVT FORMATION AT CENTRE ODISHA CM NAVEEN PATNAIK
కేంద్రంలో చక్రం తిప్పుతాం..ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ధీమా
నవీన్ పట్నాయక్ (File)
Odisha Elections 2019 | ఒడిశాకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ ఆరోపించారు. 21 లోక్సభ స్థానాల్లోనూ బీజేడీ విజయం సాధిస్తుందని, తదుపరి కేంద్రంలో ఏర్పాటుకానున్న ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని మొత్తం 21 లోక్సభ స్థానాల్లోనూ బీజూ జనతా దళ్(బీజేడీ) విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ధీమా వ్యక్తంచేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ఏ జాతీయ పార్టీకీ రాదని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ఎన్డీయే, యూపీఏలకు దక్కబోదని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో తదుపరి ఏర్పాటుకానున్న ప్రభుత్వంలో బీజేడీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తద్వారా తదుపరి కేంద్ర ప్రభుత్వంలో బీజేడీ కూడా భాగస్వామ్యం కానున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. ఒడిశాలో మళ్లీ తాము అధికారంలోకి వస్తామని నవీన్ పట్నాయక్ ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాల్లో బీజేడీ విజయం సాధించడం ద్వారా...సంవత్సరాలుగా ఒడిశాకు జరుగుతున్న అన్యాయాలకు ముగింపుపడుతుందని నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఒడిశాకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ...ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఒడిశా వేగవంతమైన అభివృద్ధి కోసం ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఒడిశాకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తే రాష్ట్రానికి అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయని, మరిన్ని నిధులు రాష్ట్రానికి వస్తాయని వివరించారు. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేంద్రంలో చక్రం తిప్పుతామని, ఒడిశాకు ప్రత్యేక రాష్ట్ర హోదా సాధిస్తాని చెప్పారు.
ఒడిశాలోని 21 లోక్సభ స్థానాలతో పాటు 147 అసెంబ్లీ స్థానాలకు మొదటి నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11, 18, 23, 29 తేదీల్లో జరిగే నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనుండగా...మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2014 ఎన్నికల్లో మొత్తం 21 స్థానాల్లో బీజేడీ 20 స్థానాల్లో విజయం సాధించగా...147 అసెంబ్లీ స్థానాల్లో 117 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి ఎన్నికల్లో అధికార బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంటోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.