Choose Municipal Ward
  CLICK HERE FOR DETAILED RESULTS

  Bihar Elections: బీహార్ మొదటి దశ ఎన్నికల్లో 54 శాతం పోలింగ్

  71 నియోజకవర్గాలకు 1066 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 952 మంది పురుషులు. 114మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

  news18-telugu
  Updated: October 28, 2020, 10:50 PM IST
  Bihar Elections: బీహార్ మొదటి దశ ఎన్నికల్లో 54 శాతం పోలింగ్
  Bihar Elections 2020 First Polling Turnout: బీహార్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన మహిళలు (Image; All India Radio/Twitter)
  • Share this:
  Bihar Election Phase 1 poll Updates: బీహార్ అసెంబ్లీకి జరిగిన తొలిదశ ఎన్నికల్లో 54 శాతం ఓటింగ్ నమోదైంది. 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓ గంట ముందుగానే పోలింగ్ ముగించారు. కరోనా వైరస్ సమయంలో ఎన్నికలు జరుగుతుండడంతో పూర్తిగా కోవిడ్ 19 నిబంధనలను అనుసరించి ఎన్నికలు నిర్వహించారు. మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 2.15 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1.12 కోట్ల మంది పురుషులు. 1.01 కోట్ల మంది మహిళలు. 599 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితాలో పేర్కొంది. 78,691 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. 16 జిల్లాల్లో తొలిదశలో జరిగిన 71 నియోజకవర్గాలకు 1066 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 952 మంది పురుషులు. 114మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారి భవితవ్యం ఇక ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

  పూర్తి కరోనా నిబంధనల ప్రకారం జరిగిన ఎన్నికల్లో ఒక్కో పోలింగ్ బూత్‌కు 1000 నుంచి 1600 మంది ఓటర్లను కేటాయించారు. 80 సంవత్సరాలు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. దీంతోపాటు ఈవీఎంల శానిటైజేషన్, ఎన్నికల సిబ్బంది, అలాగే ఓటర్లు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, థర్మల్ స్కానర్, హ్యాండ్ శానిటైజర్, సబ్బు, నీళ్లు అన్నీ పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉంచారు. 71 నియోజకవర్గాల్లో 33 అసెంబ్లీ సెగ్మెంట్లు నక్సల్ ప్రభావిత ప్రాంతం,సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో అక్కడ మరింత భద్రత ఉంచారు. కొన్ని చోట్ల ముందుగానే ఓటింగ్ ప్రక్రియను ముగించారు. తొలిదశలో మొత్తం 31,371 పోలింగ్ స్టేషన్లు వినియోగించినట్టు ఈసీ తెలిపింది.

  ఓ వైపు తొలిదశ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మరో వైపు మిగిలిన నియోజకవర్గాల్లో ప్రచారం మరింత హాట్ హాట్ గా కొనసాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మీద విరుచుకుపడ్డారు. ఆర్జేడీ - కాంగ్రెస్ కూటమి సీఎం అభ్యర్థి అయిన 30 సంవత్సరాల తేజస్వి యాదవ్‌ను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ ‘యువరాజ్ ఆఫ్ జంగల్ రాజ్’ అంటూ కామెంట్ చేశారు. పరోక్షంగా లాలూ ప్రసాద్ యాదవ్ జమానా గురించి మోదీ ప్రస్తావించారు. మోదీ అంతటితో ఆగలేదు. ‘కిడ్నాపింగ్స్‌కు కాపీరైట్’ అంటూ విరుచుకుపడ్డారు. ‘జంగల్ రాజ్‌కు చెందిన యువరాజు గురించి ఏమైనా ఆశిస్తామా? అతడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాతే ప్రమోషన్ ఇచ్చినట్టున్నారు. అతడి టాలెంట్ ఏంటో నాకంటే మీకే ఎక్కువ తెలుసు.’ అంటూ ప్రధాని మోదీ తేజస్వి యాదవ్ పేరెత్తకుండా విమర్శించారు.

  మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేత ప్రధాని మోదీ మీద, జేడీయూ - బీజేపీ కూటమి మీద మండిపడ్డారు. ‘మాకు ప్రభుత్వం నడపడం వచ్చు. మీ మనసులో మాట తెలుసు. ఔను. మాకు అబద్ధం చెప్పడం రాదు. ఎప్పటికీ నేర్చుకోం కూడా.’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దీంతోపాటు నితీష్, మోదీ కేవలం కుటుంబాల గురించి మాట్లాడతారే కానీ, ఉద్యోగాల గురించి మాట్లాడరని అన్నారు. ‘నితీష్ కుమార్ లాలూ కుటుంబం గురించి మాట్లాడతారు. మోదీ మా ఫ్యామిలీ గురించి మాట్లాడతారు. కానీ, ఇక్కడ విషయం బీహారీలకు ఉపాధి గురించి. అసలు దాని గురించి వారు మాట్లాడరు.’ అని రాహుల్ విమర్శించారు.
  Published by: Ashok Kumar Bonepalli
  First published: October 28, 2020, 10:21 PM IST
  మరిన్ని చదవండి
  తదుపరి వార్తలు

  Top Stories

  corona virus btn
  corona virus btn
  Loading