• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • BIHAR ELECTIONS LJPS PLAN TO GO ALONE CUT BOTH WAYS FULL DETAILS HERE MS

Bihar Elections 2020: ఎల్జేపీ ఒంటరిపోరుతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

Bihar Elections 2020: ఎల్జేపీ ఒంటరిపోరుతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

ప్రతీకాత్మక చిత్రం

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామానికి తెరలేసింది. దాదాపు అన్ని పార్టీలు పొత్తులలో భాగంగా సీట్ల పంపకాల పనిని కానిచ్చాయి. ఇక మిగిలింది ప్రచార వ్యూహామే. కానీ ఎన్డీయే లోనే ఉంటూ.. రాష్ట్రంలో మాత్రం నితీశ్ కుమార్ ను ఒప్పుకోమని ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఎసరు ఎవరికి..? లాభమెవరికి..?

 • News18
 • Last Updated:
 • Share this:
  కరోనా కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్ లో రాజకీయాలు వేడెక్కాయి. వ్యూహా ప్రతివ్యూహాలతో దాదాపు అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నూవెంత అంటే నూవెంత అంటూ ఒకరు.. మీ పాలనలో అభివృద్ధి శూణ్యం అని ప్రధాన పార్టీలన్నీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఎన్నికలలో పోటీ చేసేందుకు గానూ కూటములుగా ఏర్పడిన పార్టీలన్నీ సీట్ల పంపిణీ పూర్తి చేశాయి. కానీ ఇన్నాళ్లు రాష్ట్రంలో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ మాత్రం.. దాన్నుంచి బయటకొచ్చింది. ఒంటరిగానే పోటీకి దిగుతానంటున్నది. సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీ(యూ) కంటే రెండు సీట్లు ఎక్కువే గెలుస్తానని చెబుతున్నది. మరి ఆ పార్టీకి నిజంగా అంత సత్తా ఉన్నదా..? ఎల్జేపీ స్థాపకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్ పార్టీని నడిపిస్తున్నారు.

  చిరాగ్ కు అంతసీనుందా..?

  జేడీ (యూ) కంటే రెండు సీట్లైనా ఎక్కువగా గెలుచుకుంటామని చిరాగ్ చెబుతున్నారు. ప్రస్తుత ఎన్నికలలో జేడీ(యూ) 122 స్థానాల్లో పోటీకి దిగుతున్నారు. ఈ సమరంలో ఒంటరిపోరుకు దిగుతున్న ఎల్జేపీ.. సుమారు 200 స్థానాల్లో పోటీ చేయొచ్చునని సమాచారం. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే.. పదిహేనేళ్ల క్రితం... 2005 ఎన్నికలలో.. రాం విలాస్ పాశ్వాన్ ఎల్జేపీని స్థాపించారు. అప్పట్లో చాలాకాలంగా బీహార్ ను పాలిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పాశ్వాన్ సఫలమయ్యారు. 178 స్థానాలలో పోటీ చేసి.. 29 సీట్లే గెలిచినా.. చాలా చోట్ల ఓట్లను తమవైపునకు తిప్పుకోగలిగారు. ఈ ఎన్నికల నుంచే బీహార్ లో నితీశ్ శకం మొదలైంది. కాగా, ఈ ఎన్నికల తర్వాత నితీశ్ ప్రభావం పెరగడం తో ఎల్జేపీకి సీట్లు, ఓట్లు తగ్గాయి. తదనంతర ఎన్నికలలో ఆ పార్టీ గెలిచిన సీట్లు 10 లోపే. ఈ క్రమంలో 2010లో ఆర్జేడీతో, 2015 లో బీజేపీతో పాశ్వాన్ పొత్తు పెట్టుకున్నారు. 2015 లో ఆ పార్టీకి గెలిచిన సీట్లు 2 మాత్రమే. ఈ సంఖ్యను పెంచుతామని చిరాగ్ చెబుతున్నాడు.

  బీజేపీ ఎత్తుగడేనా..?

  బీహార్ లో ఎవరు ఔనన్నా కాదన్నా.. ఇప్పటికీ నితీశ్ కుమారే ఆకర్షణ కలిగిన నేతల్లో ఒకరు. బీజేపీతో కలిసి ఆయన ప్రస్తుత ఎన్నికలలో పోటీకి దిగుతున్నారు. అయితే.. నితీశ్ ను దెబ్బతీయడానికి బీజేపీ యే ఈ వ్యూహం పన్నిందని రాజకీయ విమర్శకుల వాదన. కూటమి నుంచి ఎల్జేపీని పక్కకు జరిపి.. దానితో ఒంటరిగా పోటీ చేయించి.. తద్వారా లబ్ది పొందాలని బీజేపీ బావిస్తున్నదని వారు అభిప్రాయపడుతున్నారు. బీహార్ లో ప్రస్తుతం ఎక్కువ స్థానాలలో పోటీ చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే. జేడీ (యూ) తన సీట్ల నుంచి ఏడు సీట్లను హెచ్ఎంఎకు కేటాయిస్తుండటంతో దాని మొత్తం పోటీ చేస్తున్న సీట్ల సంఖ్య 115 మాత్రమే. కానీ బీజేపీ 117 స్థానాల్లో పోటీలో ఉంది.

  ఎల్జేపీ పోటీ చేయించే అభ్యర్థులు బీజేపీకే మద్దతునిస్తారు. ఎందుకంటే కేంద్రంలో ఆ రెండు పార్టీలకు మధ్య సయోధ్య ఉంది. ఇది నితీశ్ కుమార్ కు నష్టం కలిగించేదే. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశే అని చెబుతున్నప్పటికీ.. అలా చేయడం బీజేపీకి కూడా ఇష్టం లేదని రాజకీయ విశ్లేషకుల వాదన. నితీశ్ గనక తక్కువ మెజారిటీతో గెలిస్తే ఈ సమీకరణాలు మారిపోతాయి. ఇన్నాళ్లు ఉప ముఖ్యమంత్రి రేసులో ఉన్న సుశీల్ కుమార్ మోడీ.. అక్కడ సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు బీజేపీ అధిష్టానం ఈ ఎత్తుగడలను వేస్తున్నదనే చర్చ నడుస్తున్నది.

  వికటిస్తే..

  అయితే.. ఈ ఎత్తుగడలు ఫలిస్తాయా లేదా..? అనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న వలసకార్మికులు.. బీహార్ కు తిరిగి వచ్చారు. వారికి పని కల్పించడంలో స్థానిక ప్రభుత్వం విఫలమైందనే అపవాదు ఉన్నది. ఆర్జేడీ ముఖ్యంగా దీనిపైనే దృష్టి పెట్టింది. సీఎం నితీశ్ కుమార్, బీజేపీ వైఫల్యాలను ఎండగడుతున్నది. లాలూ ప్రసాద్ యాదవ్ నిష్క్రమణతో ఆ పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకున్న ఆయన కొడుకులు తేజస్వి యాదవ్.. తేజ్ ప్రతాప్ యాదవ్.. వలస కార్మికులు, బీహార్ వరదల అంశం మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జేడీ(యూ), బీజేపీ, ఎల్జేపీ ల వ్యూహం వికటించి.. ఆర్జేడీ లాభపడొచ్చుననే విశ్లేషణలు నడుస్తున్నాయి. తన మీద కేసులున్నా.. ఆరోగ్యం సహకరించకపోయినా.. లాలూ ఇంకా బీహార్ రాజకీయాలపై తన ముద్ర వేయగలుగుతారనడంలో సందేహం లేదు.

  మరోవైపు కుల రాజకీయాలు రాజ్యమేలే బీహార్ లో కుల సమీకరణాలు చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు కుర్మీల కు మించి బలమైన క్యాడర్ లేదు. అంతేగాక ఆ పార్టీకి కొంతకాలం వరకు అండగా ఉన్న ముస్లిం ఓటుబ్యాంకు కూడా.. జేడీ(యూ) బీజేపీకి దగ్గరవుతుండటంతో క్రమంగా కోల్పోతున్నది.

  ఏదేమైనప్పటికీ.. ఈ వ్యూహ ప్రతి వ్యూహాల ద్వారా ఎక్కువగా నష్టపోయేది సీఎం నితీశ్ కుమార్ కాగా.. ఊహించని స్థాయిలో లాభపడేది మాత్రం బీజేపీయే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2019లో పార్టీ బాధ్యతలు చేపట్టిన చిరాగ్ పాశ్వాన్ అప్పట్నుంచే నితీశ్ పై గుర్రుగా ఉండి.. తాజాగా ఒంటిరిపోరు ద్వారా సాధించేది పెద్దగా ఉండదని మరి కొందరివాదన. మరి ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలంటే నవంబర్ 10 వరకు వేచి చూడాల్సిందే..
  Published by:Srinivas Munigala
  First published:

  అగ్ర కథనాలు