తెలంగాణలో అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ 1000కి పైగా ఓట్ల తేడాతో విజయం సాధించింది. బీజేపీ విజయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నాలుగు ఈవీఎంలు మొరాయించడంతో వాటిలో నిక్షిప్తమైన ఓట్లను సాంకేతికంగా చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఓట్ల లెక్కింపును కూడా పూర్తి చేసిన తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే బీజేపీ ఆధిక్యం మెరుగ్గా ఉండటంతో ఆ పార్టీ విజయం దాదాపుగా ఖాయమయ్యింది. బీజేపీ విజయంతో ఆ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.
బీహార్‌లో ఎన్డీయే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే...అక్కడ మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో ఎన్డీయే 124 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో మెజారిటీ మార్క్‌ను ఎన్డీయే కూటమి సాధించింది. మొదట మహాకూటమి వైపు నిలిచిన ఆధిక్యం, ప్రతి గంటకూ మారుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో ఎన్డీయేపై మహాకూటమి స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయితే ఆ తర్వాత పరిస్థితి తారుమారయ్యింది. ఎన్డీయే పుంజుకుని... స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే...ఎన్డీయే 124 స్థానాల్లో... ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 107 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎల్జేపీ 3 స్థానాలు, ఇతరులు 9 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
దుబ్బాక బైపోల్ స్వరూపం...
దుబ్బాక ఉప ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస రెడ్డి పోటీ చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు. మరో ఐదు మంది అభ్యర్థులు చిన్న పార్టీల బీ ఫామ్ తెచ్చుకొని బరిలో నిలిచారు. మిగతా 15 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు. దుబ్బాకలో నవంబర్ 3న పోలింగ్ జరిగింది. 82.61 పోలింగ్ శాతం నమోదైంది. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనావేయగా...మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గుచూపాయి.
బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి దశలో అక్టోబర్ 28న 71 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఆ తర్వాత రెండో దశలో నవంబర్ 3న 94 సీట్లకు, ఈరోజు మూడో దశలో 78 సీట్లకు పోలింగ్ జరిగింది. బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. 122 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి రావొచ్చని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరిగాయి. మధ్యప్రదేశ్ (28), గుజరాత్ (8), యూపీ (7), కర్ణాటక (2), జార్ఖండ్ 2, ఒడిశా 2, నాగాలాండ్ 2, తెలంగాణ 1, హర్యానా 1, ఛత్తీస్ గఢ్ 1లో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.