news18-telugu
Updated: November 19, 2020, 5:34 PM IST
మేవలాల్ చౌదరి(ఫొటో-ANI)
బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేవలాల్ చౌదరి.. గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనపై అవినీతి ఆరోపణలు రావడంతో చౌదరి ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం నితీశ్ కుమార్తో భేటీ అయి చర్చించిన అనంతరం.. చౌదరి తన రాజీనామా లేఖను సమర్పించారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో నితిశ్ కుమార్ నవంబర్ 16 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో చౌదరి కూడా ఒకరు. అయితే మూడేళ్ల క్రితం ఆయనపై నమోదైన అవినీతి కేసును ప్రస్తావించిన ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ.. నితిశ్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగింది. అవినీతిపరుడైన చౌదరిని మంత్రివర్గంలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో చౌదరి రాజీనామా చేశారు.
తారాపూర్ నుంచి ఎన్నికైన జేడీయూ ఎమ్మెల్యేగా అయినపై 2017లో అవినీతి ఆరోపణలకు సంబంధించి కేసు నమోదైంది. ఆ సమయంలో భగల్పూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైఎస్ చానెల్సర్గా ఉన్న ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ శాస్త్రవేత్తల నియమాకాల్లో అక్రమాలకు పాల్పడ్డారానే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పుడు ప్రతిపక్షంలో బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఆ సమయంలో బిహార్ గవర్నర్గా ఉన్న రామ్నాథ్ కోవింద్(ప్రస్తుతం రాష్ట్రపతి) అనుమతితో పోలీసులు చౌదరిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. అయితే అతనిపై చార్జిషీట్ మాత్రం నమోదు చేయలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జేడీయూ కొంతకాలం పాటు చౌదరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఇక, తనపై ఉన్న ఆరోపణలపై చౌదరి స్పందిస్తూ.. కేసు నమోదు చేసినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదని అన్నారు. చాలా మంద్రి ప్రజాప్రతినిధులపై కేసులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి విచారణ జరుగుతుందని.. ఏమి జరగబోదని కూడా తెలిపారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 19, 2020, 5:34 PM IST