• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BIHAR CM NITISH KUMAR MEETS PM NAARENDRA MODI AND BACKS NEW AGRICULTURE ACTS SK

Agri Acts: కొత్త వ్యవసాయ చట్టాలు భేష్.. ప్రధాని మోదీకి బీహార్ సీఎం నితీష్ మద్దతు

Agri Acts: కొత్త వ్యవసాయ చట్టాలు భేష్.. ప్రధాని మోదీకి బీహార్ సీఎం నితీష్ మద్దతు

ప్రధాని మోదీతో నితీష్ కుమార్ భేటీ

కేంద్ర బడ్జెట్‌పైనా ప్రశంసలు కురిపించారు బీహార్ సీఎం. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని.. అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా కష్ట సమయంలోనూ ఇంత అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు.

  • Share this:
    కొత్త వ్యవసాయ చట్టాలపై కొన్ని నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతుంటే.. రైతులను నిండా ముంచుతున్నారని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అటు పలు రైతు సంఘాలు కూడా ఢిల్లీ శివారులో 3 నెలలుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి సంపూర్ణ మద్దతు తెలిపారు బీహార్ సీఎం నితీష్ కుమార్. రైతులతో చర్చలు జరుపుతూ కేంద్రం సరైన మార్గంలోనే వెళ్తోందని కితాబిచ్చారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత నితీష్ కుమార్ తొలిసారిగా ప్రధాని మోదీని కలిశారు. గురువారం రాత్రి ప్రధాని మోదీ నివాసంలో ఆయన్ను కలిసి.. పలు అంశాలపై మాట్లాడారు. ఐతే ఈ భేటీ వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని నితీష్ కుమార్ తెలిపారు. బీహార్‌లో బీజేపీ-జేడీయూ విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం రాలేదని అన్నారు. ఇప్పుడు సమయం దొరికినందున మర్యాదపూర్వకంగా కలిశానని పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు అదనపు ప్రయోజనాలు కలుగుతాయే తప్ప.. ఎలాంటి నష్టం ఉండదని ఆయన తెలిపారు. ఈ విషయంలో కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు నితీష్ కుమార్.

    అంతేకాదు కేంద్ర బడ్జెట్‌పైనా ప్రశంసలు కురిపించారు బీహార్ సీఎం. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని.. అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా కష్ట సమయంలోనూ ఇంత అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు.

    ప్రధానితో భేటీ సందర్భంగా ఆయన ముందు తాను ఎలాంటి డిమాండ్లు, విజ్ఞప్తులు పెట్టలేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. ఐతే బీహార్‌లో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో.. బీజేపీ, జేడీయూ మధ్య మంత్రి పదవుల పంపకం గురించి ప్రధాని మోదీ, నితీష్ కుమార్ చర్చించినట్లు తెలుస్తోంది. ఐతే నితీష్ మాత్రం రాజకీయాల గురించి ఏమీ చర్చించలేదని.. కేవలం మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వెల్లడించారు.


    మరోవైపు ఢిల్లీ శివారులో పలు రైతు సంఘాలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ సరిహద్దుల్లో రైతులు పెద్ద మొత్తంలో బైఠాయించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. రైతులు ఉద్యమాన్ని రోజురోజుకూ ఉద్ధృతం చేస్తున్నారు. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ, ఫిబ్రవరి 6న చక్కా జామ్ చేసిన రైతులు... ఫిబ్రవరి 18న రైల్ రోకోకు పిలుపునిచ్చారు. ఆ రోజున మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన కార్యక్రమాలు ఉంటాయని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. వారికి పలు పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. శాంతియుతంగా నిరసనల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిస్తున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: