Bihar Polls: బీజేపీ, జేడీ(యూ) ల మధ్య కుదిరిన సీట్ల పంపిణీ.. ఎవరికెన్ని సీట్లంటే..!

త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అధికార ఎన్డీయే కూటమి జేడీ(యూ), బీజేపీ ల మధ్య సీట్ల పంపిణీ ఓ కొలిక్కి వచ్చింది. ఇక నితీశ్ కుమారే తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ మరోసారి స్పష్టం చేసింది.

news18
Updated: October 6, 2020, 7:07 PM IST
Bihar Polls: బీజేపీ, జేడీ(యూ) ల మధ్య కుదిరిన సీట్ల పంపిణీ.. ఎవరికెన్ని సీట్లంటే..!
మోడీ, నితీష్ (ఫైల్ ఫొటో)
  • News18
  • Last Updated: October 6, 2020, 7:07 PM IST
  • Share this:
కొద్దిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. బీహార్ లో అధికార ఎన్డీయే కూటమి జనతాదళ్ (యూ), బీజేపీల మధ్య సీట్ల పంపిణీ ఓ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ సీట్లకు గానూ రాబోయే ఎన్నికలలో జేడీ(యూ) 122, బీజేపీ 121 సీట్లలో పోటీ చేయనుంది. అయితే ఈ కూటమిలో మరో రెండు పార్టీలూ ఉన్నాయి. అవి.. జీతన్ రామ్ మాంఝీ నేతృత్వం వహిస్తున్న హిందూస్తానీ అవాం మోర్చా  (హెచ్ఏఎం) ఏడు సీట్లలో పోటీ చేయనుంది. దీనికి జేడీ(యూ) కు కేటాయించిన 122 సీట్ల నుంచి ఇవ్వాల్సి ఉంది. ఇక బీజేపీ.. తన 121 సీట్ల నుంచి వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (విఎస్ఐపీ)కి ఆరు సీట్లు కేటాయించనుంది. ఈ లెక్కన చూస్తే.. రాబోయే ఎన్నికల్లో జేడీ (యూ) సొంతంగా 115 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుండగా.. బీజేపీ 116 సీట్లలో పోటీ పడనుంది.

ఇదే విషయమై పాట్నాలో జరిగిన సంయుక్త పార్టీల విలేకరుల సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ (బీజేపీ)లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆర్జేడీలు చేస్తున్న ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు. వారి హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటో.. తమ హయాంలో జరిగిన పనులేంటో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ, జేడీ(యూ) మధ్య కన్ఫ్యూజన్ ఏమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీ సపోర్టుతో బీహార్ ను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. బీహార్ విధానసభలో ఎల్జేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయో చూసుకోవాలని నితీశ్ కుమార్ ప్రశ్నించారు.

ఇదే విషయంమీద బీజేపీ నాయకుడు సుశీల్ మోడీ మాట్లాడుతూ.. బీహార్ లో ఎన్డీయే కూటమిని నితీశే లీడ్ చేస్తారని నొక్కి చెప్పారు. చిరాగ్ పాశ్వాన్ ఆరోపణలు బాధాకరమని అన్నారు. జేడీ(యూ) సపోర్టు లేకుండా రాం విలాస్ పాశ్వాన్ కేంద్ర మంత్రి అయ్యేవారా..? అని ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంగా ఉంటే పరిస్థితులు మరో విధంగా ఉండేయన్నారు.  ప్రజల ఆశీస్సులతో నితీశ్ కుమార్ మరోసారి సీఎంగా గెలుస్తారని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక బీహార్ లో తమ నాయకుడు నితీశే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ తెలిపారు.

మూడు రోజుల క్రితం ఎల్జేజీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ బీహార్ లో నితీశ్ తో కలిసి పనిచేయలేమని బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాము నితీశ్ కు వ్యతిరేకమనీ, కేంద్రంలో ఎన్డీయే కు మాత్రం కాదనీ, తమ నాయకుడు మోడీ యే నని ఆయన స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ బీహార్ ను అభివృద్ధి చేసిందేమీ లేదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఎన్నికలలో ఒంటరిగానే పోటీకి దిగుతామని ఆయన తెలిపారు.

ఇదిలాఉండగా..ఎన్నికల ప్రచార క్యాంపెయిన్ లలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమిలో ఉన్న పార్టీలే ప్రధాని మోడీ ఫోటోను వాడుకునేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని ఎన్డీయే నాయకులు ఎన్నికల కమిషన్ ను కోరారు. మిగతా పార్టీలు కూడా మోడీ ఫోటోను వాడుకుంటున్నాయని వాళ్లు ఆరోపించారు.
Published by: Srinivas Munigala
First published: October 6, 2020, 7:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading