news18-telugu
Updated: November 10, 2020, 4:47 PM IST
కత్తి కార్తీక (ఫైల్ పోటో)
Kathi Karthika | దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేసిన కత్తి కార్తీకకు ఈ నియోజకవర్గ ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారు. అంతేకాదు ఆమెకు ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదు. వివరాల్లోకి వెళితే.. సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో తెలంగాణలోని దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యామైంది. ఈ నెల 3న దుబ్బాకలో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి.. సుజాత ఎన్నికల్లో నిలిచింది. మరోవైపు బీజేపీ నుంచి రఘునందనరావు, కాంగ్రెస్ తరుపున చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు. ఎంతో ఉత్కంఠను రేకిత్తించిన ఈ ఉప ఎన్నికల్లో చివరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందరావు అనూహ్యంగా గెలుపు సాధించారు. ఈ గెలుపు చివరి వరకు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య దోబూచులాడింది. టీ20 మ్యాచ్‌ను తలపించే సస్పెన్స్. చివరి ఓటు లెక్కించే వరకు నరాలు తెగే ఉత్కంఠ. తెలంగాణ వచ్చిన తరువాత ఇంతకుముందెన్నడూ లేనంత హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు. ఇవన్నీ ఎలా ఉంటాయో దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ అందరికీ రుచి చూపించింది. క్షణక్షణానికి మారుతున్న మెజార్టీ. ప్రస్తుతం ఉన్న తమ మెజార్టీ తరువాత రౌండ్‌కు ఉంటుందా ? తరువాత రౌండ్లో అయినా తాము మెజార్టీలోకి వస్తామా ? అని టీఆర్ఎస్, బీజేపీలు ఉత్కంఠగా ఎదురుచూసిన సందర్భం.

కత్తి కార్తీక (File/Photo)
23వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ క్యాండేట్ రఘునందర్ రావు 1470 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రఘునందనరావుకు మొత్తం 62,772 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 61302 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధికి చెరకు శ్రీనివాస్ రేెడ్డికి 21819 ఓట్లు పోలైయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్నో అంచనాలో బరిలో దిగిన యాంకర్ కమ్ బిగ్‌బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ కత్తి కార్తీక ఈ ఉప ఎన్నికల్లో మొదట ఇండిపెండెంట్ అభ్యర్థిగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఓటర్లు ఆమెకు డిపాజిట్ దక్కకుండా బిగ్ షాక్ ఇచ్చారు. ఆమెకు కనీసం 500 ఓట్లు కూడా పోల్ కాకపోవడం విశేషం. ఒక్కసారి తను అవకాశం ఇవ్వాలని… దుబ్బాక లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా ఎన్నో ఆశలతో బరిలో దిగిన కత్తి కార్తీకకు చివరకు కనీస ఓట్లు రాబట్టలేకపోయింది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 10, 2020, 4:47 PM IST