Big Shock to TDP: టీడీపీ నుంచి మరో బిగ్ వికెట్ ఔట్..! ఆ పార్టీ నుంచి మొదలైన రాయబారం

ఏపీలో టీడీపీకి మరో పెద్ద షాక్

తెలుగు దేశం పార్టీ పూర్వ వైభవం కోసం అధిష్టానం వ్యూహాలు రచిస్తుంటే.. ఆ పార్టీకి కీలక నేతలు అంతా షాక్ ఇస్తునే ఉన్నారు. తాజాగా టీడీపీలో మరో బిగ్ వికెట్ పడిపోతోంది అంటూ ప్రచారం ఊపందుకుంది.. ఇంతకీ ఎవరా పెద్ద నేత..

 • Share this:
  P. Bhanu Prasad, Correspondent, Visakhapatnam, news18  టీడీపీని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి వరుస షాక్ లు తప్పడం లేదు. ఇప్పటికే చాలామంది కీలక నేతలు పార్టీకి బైబై చెప్పి ఎవరు దారి వారు చూసుకున్నారు. ఇప్పుడు మరో కీలక నేత పార్టీ మారుతారు అంటూ ప్రచారం ఊపందుకుంది. ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు టీడీపీని వీడేందుకు సిద్దమయ్యారా.? అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న ఆ నేతను అధిష్టానం పట్టించుకోవడం లేదా? లేక మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఎదురవుతున్న తలనొప్పులతో ఆయన సతమతం అవుతున్నారా..? అసలు ఎందుకు ఆయన పార్టీ మారాలి అనుకుంటున్నారు.. లేదా ఆయన వస్తే తమకు లాభమని వేరే పార్టీలు భావిస్తున్నాయా..? ప్రచారంలో వాస్తవం ఎంత..? ఇప్పుడు అశోక్ వర్గీయుల్లో, టీడీపీ కార్యకర్తల్లో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది.

  రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న పూసపాటి వంశంలో రెండో తరానికి చెందిన అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్రలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు కు సుదీర్ఘ రాజకీయ అనుభవం వుంది. విజయనగరం అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి, అనేక మంత్రి పదవులు చేపట్టారు. 2014 ఎన్నికల్లో మొదటిసారి ఎంపీగా గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంలో తొలి టర్మ్ లోనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేసారు. కానీ ఈ రాజకీయ అనుభవం అంతా చరిత్రగానే  మిగిలిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయంగా ఆయన చాలా ఒత్తిడిలో ఉన్నట్టు ప్రచారం ఉంది.

  తనకున్న రాజరికంతో, పెద్దరికంతో, తనకున్న అనుభవంతో హుందాగా వ్యవహరించే అశోక్ గజపతిరాజు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. 2016లో తన అన్న పూసపాటి ఆనందగజపతిరాజు మరణంతో మాన్సాస్ ఛైర్మన్ గా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ట్రస్ట్ నిబంధనల మేరకు మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు చేపట్టారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలిగించి .. సంచయితా గజపతిరాజును ఛైర్మన్ గా చేసారు. దాంతో పాటు సింహాచలం దేవస్ధానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా, రామతీర్ధం ఆలయం ట్రస్ట్ చైర్మన్ గా కూడా తొలగించారు. ఇందుకు సంబంధించి 2020 ఫిబ్రవరిలో రెండు జీవోలు జారీచేసింది ప్రభుత్వం. కాగా, తనకు జరిగిన అవమానంపై .. అశోక్ గజపతి సుదీర్ఘ కాలం న్యాయ పోరాటం చేసి గత నెలలో మళ్లీ..  హైకోర్టు తీర్పు మేరకు ఛైర్మన్ పీఠం దక్కించకున్నారు. సంచయితా గజపతి చైర్మన్ గా పదవీబాధ్యతలు చేపడుతూనే .. అశోక్ గజపతిరాజుపై అనేక ఆరోపణలను తెరమీదకు తీసుకువచ్చారు. ప్రస్తుతం మాన్సాస్ విషయంలో హైకోర్టు తీర్పు తరువాత, వైసీపీ నాయకులు, సంచాయితా గజపతిరాజుతో గొంతు కలిపి.. అశోక్ గజపతిరాజు హాయంలో మాన్సాస్ లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నారు. కనీసం 10 ఏళ్లుగా ట్రస్ట్ ఆడిటింగ్ సైతం నిర్వహించకుండా గడ్డి పీకుతున్నారా? అంటూ ఘాటుగా విమర్శలు చేసారు. ఇలాంటి అనేక అంశాలు బయటకు వచ్చి.. ప్రస్తుతం మాన్సాస్ ట్రస్ట్ ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు.

  కొంత కాలంగా వైసీపీ నేతలకు అశోక్ గజపతి టార్గెట్ అయిపోయారు. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్, ఎంపీ విజయ సాయిరెడ్డి నేరుగా అశోక్ ను టార్గెట్ చేస్తూ ఈ మధ్య రోజుకో ట్వీట్ వదులుతున్నారు. కొంత ఘాటైన విమర్శలు చేస్తున్నారు. సింహాచలం భూములు, ట్రస్ట్ ఆస్తులను అశోక్ గజపతి దోచుకున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ట్విట్టర్ వేదికగానూ, మీడియాతో కూడా మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారు. త్వరలోనే అశోక్ గజపతి బండారం బయటపెడతాం అంటూ అనేక కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా మంత్రి వెల్లంపల్లి నేరుగా అశోక్ గజపతి పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారి తీసాయి. క్షత్రియ సంఘాలు, టీడీపీ నేతలు దీని పైన అభ్యంతరం వ్యక్తం చేసాయి. దీనికి కౌంటర్ గా మంత్రి రంగనాధ రాజు మరో ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. అయితే, కొంత కాలంగా వివాదాలతో అశోక్ మనస్థాపానికి గురయ్యారు. ఈ సమయంలో టీడీపీ నుంచి ఆయనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా అశోక్ పైన వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుందని, అరెస్ట్ చేస్తారన్న వార్తలు సైతం బయటకు వచ్చాయి.

  తాను ఇంత కాలం నమ్ముకున్న పార్టీ..  కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవకపోవటం పైన అశోక్ గజపతి మనస్థాపంతో ఉన్నట్లుగా పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఏ సమయంలోనైనా అశోక్ గజపతి టీడీపీ అధిష్టానంపై విమర్శలు చేసేందుకు సిద్దం అవుతున్నారంటూ జిల్లా పార్టీ ముఖ్యులు కూడా అనుకుంటున్నారు. మరోవైపు గత కొంత కాలంగా అశోక్ గజపతిరాజుతో .. కొందరు బీజేపీ నేతలు టచ్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. విశాఖకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీతో పాటు కొంతమంది నేతలు అశోక్ గజపతిరాజును కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన నేపధ్యంలో బీజేపీలోకి రావాలని.. ఆహ్వానించారు. పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని, కేంద్ర పెద్దలు కూడా హామీ ఇచ్చారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే తన ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని.. గతంలో అశోక్ గజపతిరాజు చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న ప్రచారం పైన మాత్రం ఆయన ఇటీవలి కాలంలో స్పందించటం లేదు.

  2019 ఎన్నికల ముందు టీడీపీ కేంద్ర కేబినెట్ లో నుంచి బయటకు రావటం.. బీజేపీతో దూరం అయ్యే సమయంలోనూ అశోక్ ఆ నిర్ణయాన్ని తప్పు బట్టారని అప్పట్లోనే ప్రచారం సాగింది. కానీ, పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత సైతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. కొన్ని విధాన పరమైన అంశాలపై మాట్లాడటం తప్పితే.. నేరుగా బీజేపీని గానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ విమర్శించలేదు. ప్రస్తుతం ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం తనను కావాలని డామేజ్ చేస్తుందని, మాన్సాస్ విషయంలో లేని అక్రమాలను తనకు అంటగట్టాలన్న ఆలోచనలో వున్నట్టుగా అశోక్ భావిస్తున్నారు. అప్పటివరకూ ఎవరో తెలియని.. సంచయితా గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్ గా తీసుకురావడం, తనను ఇబ్బంది పెట్టడం వంటి అంశాలు అశోక్ గజపతిరాజును బాగా కుంగదీసాయి. ఈ నేపధ్యంలోనే .. బీజేపీలోకి వస్తే ఆయన అనుభవం, ఆయన కుటుంబానికి ఉన్న గుర్తింపుకు తగినట్లుగా ప్రాధాన్యత ద్ళష్ట్యా బీజేపీలో తగిన ప్రాతినిధ్యం, గౌరవం ఉంటుందని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రాయబారంలో విశాఖకు చెందిన ఒక కీలక నేత సైతం ఉన్నట్లు సమాచారం. దీని పైన అశోక్ గజపతి రాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ విషయంలో టీడీపీ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందనేది.. ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
  Published by:Nagesh Paina
  First published: