• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BIG SHOCK TO YCP DEPUTY CM PAMULA PUSPHA SRIVANI IN KURAPAM NGS

AP Municipal elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ముందు వైసీపీకి షాక్ : డిప్యూటీ సీఎం పుష్పవాణి మామ రాజీనామా

AP Municipal elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ముందు వైసీపీకి షాక్ : డిప్యూటీ సీఎం పుష్పవాణి మామ రాజీనామా

పాముల పుష్ప శ్రీవాణి

విజయనగరం జిల్లాలో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి సొంత మామ శత్రుచర్ల పార్టీకి రాజీనామా చేశారు.. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.

  • Share this:
    ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వరుస విజయాలతో జోరు మీద ఉంది అధికార వైసీపీ. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో తొలి మూడు విడతల్లోనూ తిరుగులేని ఆధిక్యం సాధించింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ మద్దతు దారులు మెజారిటీ పంచాయతీలు దక్కించుకున్నారు. కొన్ని చోట్ల అసలు ప్రత్యర్థి టీడీపికి డిపాజిట్ కూడా దక్కలేదు.. అంతా సవ్యంగానే ఉంది అనుకున్న సమయంలో అధికార పార్టీకి ఊహించని షాక్ తగిలింది.

    మున్సిపల్ ఎన్నికలకు ముందు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన కీలక నేత, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో వైసీపీ బలహీనపడే అవకాశాలు ఉన్నాయి.

    వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల వలనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు శత్రుచర్ల ప్రకటించారు. కార్యకర్తల సమావేశం తర్వాత ఏ పార్టీలో చేరుతానన్నదానిపై స్పష్టత ఇస్తాను అన్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన తీరు.. స్థానిక పరిస్థితులను అంచనా వేస్తే టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే వైసీపీతో పాటు డిప్యూటీ సీఎంకు ఇది పెద్ద ఎదురుదెబ్బే.. ఆమె కురపాంలో గెలవడానికి శుత్రుచర్ల చంద్రశేఖర్ రాజు శ్రమే కారణం.

    వైసీపీ పరిపాలనలో అభివృద్ధి ఆగిపోయిందని శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు ఆరోపించారు.  కురపాం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. వైసీపీకి అనుకూలంగా లేనివారికి పథకాలు అందడం లేదన్నారు. 2019 తరువాత ఎక్కడా అభివృద్ధి జరగడం లేదన్నారు. పిడుగుపడి మరణించిన వారికి ఇప్పటి వరకు సాయం అందలేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు

    ఆయన రాజీనామా చేసినా.. బుజ్జగించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. పుష్ప శ్రీవాణి భర్త పరక్షిత్‌రాజుతో పాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు చంద్రశేఖర రాజును బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఆయన వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అంటున్నారు స్థానిక నేతలు.

    విజయనగరం జిల్లాలో కురుపాం నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఒడిశా సరిహద్దుకు ఆనుకుని ఉన్న కురుపాంలో 11 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా శత్రుచర్ల వంశానికి చెందిన వారే శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గంలో ప్రజలకు వారి మాటంటే ఎంతో గౌరవం. అందుకే ఆ కుటుంబానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 1967లో మొదటిసారిగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. తొలి ఎమ్మెల్యేగా 1967లో శత్రుచర్ల ప్రతాపరుద్రరాజు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందిన శత్రుచర్ల పరక్షిత్‌రాజు సతీమణి పాముల పుష్పశ్రీవాణి వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు శత్రుచర్ల విజయరామరాజు. 1978, 1983, 1985, 1999లలో ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. 1989లో విజయరామరాజు తమ్ముడు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, 2009లో మేనల్లుడు వీటీ జనార్దన్‌ థాట్రాజ్‌లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014లో ఆయన కోడలు పాముల పుష్పశ్రీవాణి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
    Published by:Nagesh Paina
    First published: