Andhra Pradesh: చంద్రబాబుకు సొంతూరిలో షాక్. నారావారి పల్లెలో లైట్ తీసుకున్న తమ్ముళ్లు

ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం

టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ లపై షాక్ లు తప్పడం లేదు. ఒకప్పుడు పార్టీలో చంద్రబాబు చెప్పిందే ఫైనల్. ఆయన గీసిన గీత దాటాలి అంటే సీనియర్ నేతలు సైతం భయపడే వారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సొంత ఊరిలోనే తమ్ముళ్లు ఆయనకు షాక్ ఇస్తున్నారు.

 • Share this:
  టీడీపీ అధినేత చంద్రబాబుకు బ్యాడ్ టైం నడుస్తోందా? రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబుకు ప్రస్తుతం ఏదీ కలిసిరావడం లేదా? ఎన్నికల్లో వ్యూహాలు పన్నడంలో రాజకీయ చాణుక్యుడని ముద్ర ఉంది. కానీ ప్రస్తుతం ఆయన వేసిన ఏ పాచికా పారడం లేదు. దీంతో వరుస ఓటములు తప్పడం లేదు. 2019 ఎన్నికలు మిగిల్చిన చేదు అనుభవాలను మరిచిపోకముందే.. ఇటీవల వరస పరాజయాలు కుంగదీస్తున్నాయి. మొన్న పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలతో టీడీపీ పరువు మొత్తం పోయింది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రెండంటే రెండు చోట్ల మాత్రమే టీడీపీ వైసీపీకి పోటీ ఇవ్వగలిగింది. అందులో మైదుకూరులో స్వల్ప మెజార్టీతో బయటపడినా.. ఎక్స్ అఫిషియో సభ్యులతో ఆ చైర్మన్ పదవి కూడా పోయింది. తాడిపత్రిలో మాత్రమే జేసీ బ్రదర్స్ గట్టిగా నిలబడడంతో ఒక్క చైర్మన్ పదవితో ఆనంద పడాల్సి వచ్చింది.

  ఆ చేదు పరాజయాలను మరిచిపోక ముందే పరిషత్ పోరు టెన్షన్ పెట్టింది. దీంతో ఫలితాలు ఎలా వస్తాయో ముందే ఊహించిన చంద్రబాబు ఈ ఎన్నికలను బహిషర్కించడమే మేలని పొలిట్ బ్యూరో మీటింగ్ పెట్టి మరీ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఎస్ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదని.. అక్రమాలు, ఆరాచకాలతో అధికార పార్టీ గెలుపొందే ప్రయత్నం చేస్తుంది అంటూ పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. చంద్రాబు ఆ నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి టీడీపీలో రాజకీయ తుపాను మొదలైంది.

  అప్పటికే చంద్రబాబు నిర్ణయంపై అసహనంతో గుర్రుగా ఉన్న సీనియర్ నేతలంతా బహరింగంగానే తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అశోక్ గజపతి రాజు నేరుగా జిల్లా నేతలను పరిషత్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని బహిరంగంగా ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులైతే ఇప్పటికే పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా చంద్రబాబు సొంత ఊరిలోనూ కూడా ఆయన నిర్ణయానికి షాక్ తప్పలేదు.

  చిత్తూరు జిల్లా సొంత ఊరైన నారావారిపల్లెలో తెలుగు తమ్ముళ్ళు అధినేతకు ఊహించని షాక్ ఇచ్చారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నామని బాబు చేసిన ప్రకటనను వారు ఏమాత్రం పట్టించుకోలేదు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధర ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. భీమవరం సెగ్మెంట్ పరిదిలో ఆయన ప్రచారం చేశారు. రెండు రోజుల కిందటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించినట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు. మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా.. చంద్రబాబు సొంత గ్రామంలోనే ఇలా తెలుగు తమ్ముళ్లు అధినేత మాటను ధిక్కరించడం నిజంగా షాకే అని చెప్పాలి.
  Published by:Nagesh Paina
  First published: