BIG BLOW FOR TDP IN AP YSRCP CREATES SUNAMI IN ELECTORAL POLLS JAGAN PARTY SWEEPS SOME OF THE DISTRICTS AK
ఏపీలో జగన్ సునామీ... టీడీపీ ఔట్... పలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
Ap assembly election results 2019 | రాష్ట్రంలో కాంగ్రెస్ హవా బలంగా వీచిన సమయంలోనూ చంద్రబాబు ఓట్ల లెక్కింపు సమయంలో వెనుకబడ్డ సందర్భాలు లేవు. అలాంటిది వైసీపీ సునామీలో చంద్రబాబు కూడా కొన్ని రౌండ్లలో వెనుకబడాల్సి వచ్చింది.
ఏపీలో ఎక్కువమంది ఊహించిందే జరిగింది. వైసీపీ నేతలు, కార్యకర్తల నమ్మకం వందకు వంద శాతం నిజమైంది. ఏపీలో వైసీపీ సునామీ సృష్టించింది. రావాలి జగన్ కావాలి జగన్ అన్న వైసీపీ నినాదానికి ఏపీ ప్రజలు పూర్తిగా ఆకర్షితులయ్యారని ఫలితాల సరళిని బట్టి అర్థమైంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే వైసీపీ దూకుడు కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లు మొదలుకుని ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లు వరకు అంతా వైసీపీకే పడ్డాయని ఫలితాలను బట్టి అర్థమవుతోంది. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం పలు రౌండ్లలో వెనుకబడిపోయారంటే ఏపీలో వైసీపీ జోరు ఏ రకంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో కాంగ్రెస్ హవా బలంగా వీచిన సమయంలోనూ చంద్రబాబుకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. అలాంటిది వైసీపీ సునామీలో చంద్రబాబు కూడా కొన్ని రౌండ్లలో వెనుకబడాల్సి వచ్చింది. ఆయన కేబినెట్లోని అనేక మంది మంత్రులు సైతం ఓటమి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా పోరాడుతున్నారు. ట్రెండ్స్‌ను బట్టి చూస్తే... ఏపీలో పోలైన ఓట్ల శాతంలో దాదాపు 50 శాతం ఓట్లు వైసీపీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో క్వీన్ స్వీప్ దిశగా వైసీపీ దూసుకుపోతోంది. మరికొన్ని జిల్లాలు కూడా ఈ జాబితాలో చేరొచ్చని ట్రెండ్స్‌ను బట్టి అర్థమవుతోంది.
మంగళగిరిలో వైసీపీతో హోరాహోరీగా పోరాడుతున్న ఏపీ మంత్రి, చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్ గెలుపు కూడా అనుమానంగానే కనిపిస్తోంది. అసెంబ్లీలోనే కాదు లోక్ సభ ఫలితాల్లోనూ వైసీపీ దూకుడు కొనసాగింది. ఒకటి రెండు సీట్లు మినహా... అన్ని లోక్ సభ స్థానాల్లోనూ వైసీపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపు సరళిని బట్టి చూస్తే వైసీపీకి 22కు మంది లోక్ సభ స్థానాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీలో ఫలితాలను బట్టి చూస్తుంటే... టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు అర్థమవుతోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.