తొలిదశ పోలింగ్‌కు ముందు కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. గుజరాత్‌లో కీలమైన బీసీ నేత అల్పేశ్ ఠాకూర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పట్ల కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు. ఆయన త్వరలో బీజేపీలో చేరే అవకాశముంది.
లోక్‌సభ ఎన్నికల్లో పటాన్ నియోజకవర్గం నుంచి అల్పేశ్ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం మాజీ ఎంపీ జగదీష్ ఠాకూర్‌ను బరిలో దింపింది. కాంగ్రెస్ నిర్ణయంపై అల్పేశ్ నేతృత్వం వహిస్తున్న గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. కనీసం సబర్కాంత లోక్‌సభ సీటునైనా తమవర్గానికి కేటాయించాలని కోరింది. కానీ అక్కడా అన్యాయం జరగడంతో కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంది గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన.
అటు అల్పేశ్ ఠాకూర్‌కి సైతం గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన ప్రతినిధులు అల్టిమేటం జారీచేశారు. కాంగ్రెస్‌తోనే ఉండాలనుకుంటే క్షత్రియ ఠాకూర్ సేనను వీడాలని.. ఒకవేళ తమతోనే ఉండాలనుకుంటే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పాలని స్పష్టంచేశారు. 24 గంటల్లోగా ఏదో ఒక నిర్ణయం చెప్పాలని మంగళవారం జరిగిన కోర్‌కమిటీ సమావేశం తర్వాత తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే అల్పేశ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
కాగా, బీసీ సామాజికవర్గానికి చెందిన అల్పేశ్ ఠకూర్ స్థానికంగా బలమైన నేతగా పేరుంది. ముఖ్యంగా థాకూర్ వర్గంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో అల్పేశ్ ఠాకూర్ చేరారు. పటాన్ జిల్లాలోని రాధన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐతే ఎన్నికల వేళ ఆయన పార్టీని వీడడం.. కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Gujarat, Gujarat Lok Sabha Elections 2019, Patan S06p03