మూడు రాజధానులపై భూమా అఖిలప్రియ స్పందన, వైసీపీకి నిజంగా అభివృద్ధి చేయాలని ఉంటే...

కర్నూల్లో కేవలం హైకోర్ట్ బెంచ్ మాత్రమే ఏర్పాటుచేస్తామంటున్న ప్రభుత్వం, దానివల్ల సీమప్రాంతం ఎలా బాగుపడుతుందో చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: October 10, 2020, 3:23 PM IST
మూడు రాజధానులపై భూమా అఖిలప్రియ స్పందన, వైసీపీకి నిజంగా అభివృద్ధి చేయాలని ఉంటే...
భూమా అఖిలప్రియ
  • Share this:
అమరావతిప్రాంత రైతులు, మహిళలు 300రోజులనుంచీ ధర్నాలు, పోరాటాలుచేస్తున్నా, ప్రభుత్వంలో చలనంలేదని, అన్నంపెట్టే అనద్నాతలకు అన్యాయం చేస్తూ కూడా, తనకేమీ పట్టనట్లుగా ప్రభుత్వం కళ్లు మూసుకొని వ్యవహరించడం దారుణమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. జూమ్ యాప్ ద్వారా ఆమె విలేకరులతో మాట్లాడారు. రైతులు బాగుంటేనే రాష్ట్రమైనా, దేశమైనా బాగుంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలోని రైతులకు ఇటువంటి దుస్థితి వచ్చినందుకు అందరం సిగ్గుపడాలన్నారు. ప్రజలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, డబ్బు సంపాదనే ధ్యేయంగా అవినీతిపాలనతో ముందుకెళుతోందన్నారు. రాయలసీమకు, అమరావతి రైతులకు, మరోప్రాంతానికి రాజధానికి మధ్య చిచ్చుపెట్టాలని వైసీపీనేతలు చూస్తున్నారన్నారు. రాష్ట్రం బాగుంటేనే ప్రజలంతా బాగుంటారని, ప్రజలు వారిలోవారే కొట్టుకునేలా చేయడంద్వారా పాలకులు తమపబ్బం గడుపుకుంటున్నారన్నారు.

రాష్ట్రాన్ని ముక్కలుచేసి, ప్రజలమధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న వైసీపీప్రభుత్వం, ఏపీని 20ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిందన్నారు. అమరావతి రైతులు రాష్ట్ర క్షేమం, ప్రజలందరి కోసం భూములిస్తే, వారిని రోడ్లపాలు చేయడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే, ఇప్పుడున్నవారు ఎక్కడ కూర్చొని పాలన చేస్తున్నారో, ఎవరు వేసినరోడ్లపై నడుస్తున్నారో చెప్పాలని అఖిలప్రియ నిలదీశారు. అమరావతిలో దాదాపు రూ.10వేల కోట్లతో చేసిన అభివృద్ధి పనులు పాలకులకు కనిపించడం లేదా అని భూమా అఖిలప్రియ నిలదీశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని, రైతులు మహిళలపై దాడులకు పాల్పడటం ఏమాత్రం సరికాదన్నారు. అమరావతి రైతులకు అన్నివేళలా మద్ధతుగానే ఉంటామని, కర్నూలుకు హైకోర్టు తీసుకొస్తామని మభ్యపెట్టినా పాలకుల మాటలు వినేది లేదన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని గతప్రభుత్వం బాగానే అభివృద్ధి చేసిందన్నారు.

కర్నూలులో ఉండే న్యాయవాదులే, అక్కడ హైకోర్టు ఏర్పాటుపై అసంతృప్తితో ఉన్నారన్నారు. తమప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు సంగతి దేవుడెరుగు...విశాఖపట్నం వెళ్లాలంటే ఎలాగని వారంతా వాపోతున్నారన్నారు. అమరావతి రైతులకష్టాలు, వెతలను దేశమంతా గమనిస్తోందని, వారికి అన్నిప్రాంతాలనుంచి మద్ధతు లభిస్తుందనే నమ్మకం తనకుందని మాజీమంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు అసెంబ్లీలో స్వాగతించిన జగన్, ఇప్పుడెలా మాటమారు స్తాడన్నారు. ఆనాడు మాట్లాడిన వైసీపీ నేతలంతా, జగన్ రాజధానిలో ఇల్లుకట్టుకున్నాడని, ఆయన రాజధానిని మార్చడని చెప్పారని, వారంతా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జగన్ వైఖరిని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం పోయిందన్నారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేవారు, అధికారం చేతిలో ఉంచుకొని దాన్ని ఎందుకు నిరూపించలేకపోయారని అఖిలప్రియ ప్రశ్నించారు. కుంభకోణాలు, అవినీతి ఎక్కడ జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారని, వైసీపీ ప్రభుత్వం విశాఖను రాజధానిగా ప్రకటించాక అక్కడ దాదారు 72వేల వరకు రిజస్ట్రేషన్లు జరిగాయన్నారు. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి చేయాలన్నఆలోచనే ఉంటే, విజయనగరాన్నో, ప్రకాశం జిల్లానో, లేదా మరోవెనుకబడిన ప్రాంతాన్నో అభివృద్ధిచేస్తే మంచిదని, ఇప్పటికే అన్నిరకాలుగా అభివృద్ధి చెందిన విశాఖలో కొత్తగా చేసేదేమీ లేదన్నారు. విశాఖలో జరుగతున్న భూ వ్యవహరాల్లో ఎంతమంది వైసీపీనేతలున్నారో చెప్పాల్సిన పనిలేదన్నారు.

కర్నూల్లో కేవలం హైకోర్ట్ బెంచ్ మాత్రమే ఏర్పాటుచేస్తామంటున్న ప్రభుత్వం, దానివల్ల సీమప్రాంతం ఎలా బాగుపడుతుందో చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. వైసీపీప్రభుత్వానికి ఓట్లేసినవారంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని, ఇసుక, మద్యం, రైతుల ఆత్మహత్యల సంఘటనలు చూస్తుంటేనే పాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ అమరావతి ప్రాంతానికి మద్ధతు తెలపాలని మాజీమంత్రి ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 10, 2020, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading