Chandrababu Naidu: చంద్రబాబుకు షాక్.. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న మాజీమంత్రి

చంద్రబాబునాయుడు

Andhra Pradesh: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన అఖిలప్రియ.. తన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలుస్తారని ప్రకటించారు.

  • Share this:
    ఏపీలో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించినా.. కొందరు నేతలు మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయంతో సంబంధం లేకుండా తమ ప్రాంతంలో టీడీపీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారని తేల్చిచెబుతున్నారు. కొందరు టీడీపీ అధినేత తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తమదైన శైలిలో నిరసన తెలుపుతుంటే.. మరికొందరు నేతలు మాత్రం టీడీపీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మాజీమంత్రి భూమా అఖిలప్రియ కూడా చేరిపోయారు.

    కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన అఖిలప్రియ.. తన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలుస్తారని ప్రకటించారు. తమ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. గతంలోనే ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేశారు కాబట్టి.. ప్రచారం కూడా చేస్తారని ఆమె తెలిపారు. అభ్యర్థులు ప్రచారం చేయాలని సూచించారు. పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

    ఇదిలా ఉంటే ఏపీలో జరగబోయే పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. గ‌త ఎన్నిక‌ల‌లో అధికార‌పార్టీ అరాచ‌కాల‌కు నిర‌స‌న‌గా ఈ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. గ‌త రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్న స‌మ‌యంలోనే ఎన్నిక‌ల‌లో దౌర్జాన్యాల‌కు, అరాచ‌కాల‌కు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకుందని తెలిపింది.
    ఇప్పుడు కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని ఆధ్వర్యంలో జ‌రిగే ఎన్నిక‌ల‌లో మ‌రిన్ని అక్రమాలు, దౌర్జన్యాలకు వైసీపీ పాల్పడే అవకాశం ఉందని ఆరోపించింది. ఈ ఎన్నిక‌ల ప్రక్రియను మొత్తం రద్దు చేసి మొద‌టి నుంచి ఎన్నిక‌ల నిర్వహించాలనే త‌మ డిమాండ్‌ను తిరస్కరించారని.. దీన్ని బట్టి ఎన్నిక‌లు ఎలా జ‌ర‌గనున్నాయో తెలుస్తుందని టీడీపీ వ్యాఖ్యానించింది. అయితే టీడీపీ అధినాయకత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకున్నా.. కొన్ని చోట్ల క్షేత్రస్థాయి నాయకులు మాత్రం పోటీకి సై అంటున్నారు. దీంతో పలువురు నేతలు తమ ప్రాంతాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ప్రకటిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: