Uttar Pradesh Election : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. తొలిసారిగా యూపీ అసెంబ్లీ పోటీ చేసేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సిద్ధమైన విషయం తెలిసిందే. గతంలో తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు ఇటీవల యోగి ఆదిత్యనాథ్ కన్ఫర్మ్ చేశారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా అతనిపై తాను పోటీకి దిగుతానని గతంలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. యూపీ అసెంబ్లీలో ఓ సీటుని గెలవడం తనకు ముఖ్యం కాదు.. యోగి ఆదిత్యనాథ్ ని అసెంబ్లీకి రాకుండా చేయడమే తనకు ముఖ్యమని..కాబట్టి ఆయన ఎక్కడ పోటీ చేసినా నేను పోటీ చేస్తాను అని గత ఏడాది ఓ సందర్భంలో భీమ్ ఆర్మీ చీఫ్ చెప్పారు.
ఈ క్రమంలో ఇప్పుడు యోగి పోటీకి దిగుతున్న గోరఖ్ పూర్ నుంచి ఛంద్రశేఖర్ ఆజాద్ బరిలోకి దిగుతున్నట్లు ఆయన నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ గురువారం సంచలన ప్రకటన చేసింది. అయితే గోరఖ్‌పూర్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి పోటీగా ప్రకటించిన మొదటి అభ్యర్థి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్ ఎన్నికల్లో పోటీకి దిగుతుండటం ఇదే తొలిసారి. ఇక, యోగి ప్రధాన ప్రత్యర్థి అయిన సమాజ్‌వాదీ పార్టీ ఇంకా గోరఖ్ పూర్ అభ్యర్థి పేరుని ప్రకటించలేదు.
ALSO READ UP Election : యూపీలో మళ్లీ బీజేపీనే..అఖిలేష్ కి కష్టమేనన్న తాజా సర్వే
భీమ్ ఆర్మీ చీఫ్ మరియు అతని పార్టీకి గోరఖ్‌పూర్ లేదా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో అసలు బేసే లేదు. గోరఖ్‌పూర్ సదర్ అసెంబ్లీ స్థానం 1989 నుండి ఒక్కసారి తప్ప ఇప్పటివరకు ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి చెందిన రాధామోహన్ దాస్ అగర్వాల్ 60 వేల ఓట్ల తేడాతో గోరఖ్ పూర్ నుంచి విజయం సాధించారు.
ఇక,అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు చర్చలు విఫలమవడంతో ఆ పార్టీతో పొత్తు పొత్తు పెట్టుకోబోమని చంద్రశేఖర్ ఆజాద్ ఇటీవల ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ తనను మోసం చేసిందని, తన పార్టీకి 25 సీట్లు ఇస్తామని ఇచ్చిన హామీని విస్మరించినట్లు ఆయన ప్రకటించారు.
చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని భీమ్ ఆర్మీ... మే 2017లో సహరాన్‌పూర్‌లో దళితులు- అగ్రవర్ణ ఠాకూర్‌ల మధ్య జరిగిన ఘర్షణల సమయంలో దేశం దృష్టిని ఆకర్షించింది. ఘర్షణల అనంతరం చంద్రశేఖర్ ఆజాద్‌ను అరెస్టు చేశారు. అలహాబాద్ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు అతన్ని కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద అరెస్టు చేశారు. 16 నెలల జైలు జీవితం తర్వాత 2018 సెప్టెంబర్‌లో చంద్రశేఖర్ ఆజాద్ విడుదలయ్యాడు.
మరోవైపు,అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీ బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో సమాజ్ వాదీ పార్టీని లక్ష్యంగా చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన అఖిలేష్ యాదవ్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అఖిలేష్ యాదవ్ మైన్‌పురి సదర్, ఛిబ్రామౌ (కన్నౌజ్), గోపాల్‌పూర్ (అజంగఢ్), గున్నౌర్ (సంభాల్) అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే విషయమై పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నాలుగు స్థానాల్లో ఏ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ ఎన్నికల బరిలోకి దిగుతారన్నది జాబితా విడుదల చేసే దాకా ఆగాల్సిందే.
ఇక, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెర లేపారు. వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్న దృష్ట్యా పలు పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు టికెట్ల కోసం పార్టీలు మారుతున్నారు. తాజాగా గురువారం సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. సమాజ్ వాదీపార్టీ నేరగాళ్లు, జూదగాళ్లకు అడ్డాగా మారిందని ప్రమోద్ గుప్తా ఆరోపించారు. అఖిలేష్ యాదవ్ ములాయంసింగ్ నే జైలులో పెట్టాడని ప్రమోద్ గుప్తా ఆరోపించారు. ఎస్పీ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారిందని ప్రమోద్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆదితిసింగ్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. ఆదితిసింగ్ గతంలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినా అధికారికంగా సోనియాగాంధీకి రాజీనామా లేఖను గురువారం పంపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.