తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. ఆ జిల్లా నుంచే మొదలు..

BJP Operation Akarsh: బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ హైదరాబాద్‌లోనే మకాం వేశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులను పార్టీలోకి తీసుకొనేందుకు వ్యూహాలు రచిస్తూ, వారితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 14, 2019, 9:47 AM IST
తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. ఆ జిల్లా నుంచే మొదలు..
బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ చర్యలు మొదలు పెట్టిందా? నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న ఊపులో ఆపరేషన్ ఆకర్ష్‌ అంటోందా? పలు పార్టీల్లో ఉన్న అసంతృప్తులు, కీలక నేతలకు గాలం వేస్తోందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కరీంనగర్‌లో బండి సంజయ్ కుమార్, సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి, నిజామాబాద్‌లో అరవింద్, ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఈ స్థానాలన్నింటిలో కరీంనగర్‌లో పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో అక్కడి నుంచే పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ నేత రాంమాధవ్ హైదరాబాద్‌లోనే మకాం వేశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులను పార్టీలోకి తీసుకొనేందుకు వ్యూహాలు రచిస్తూ, వారితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తోపాటు టీడీపీలోని ప్రముఖ నాయకులను బీజేపీలోకి ఆహ్వానించే ఆలోచనతో పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో పెద్దపల్లి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ గడ్డం వివేక్‌తో రాంమాధవ్ సంప్రదింపులు జరుపుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేక్ అభ్యర్థిత్వాన్ని పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో ఆయనకు పెద్దపల్లి టికెట్ దక్కలేదు. దీంతో ఆయన్ను కాదని చెన్నూరు అసెంబ్లీకి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన బొర్లకుంట వెంకటేశ్‌‌ను టీఆర్‌ఎస్‌లోకి తీసుకొని టికెట్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కీలక పాత్ర పోషించగా, మిగతా ఎమ్మెల్యేలు సహకరించారు. అదే సమయంలో వివేక్‌పై బీజేపీ కన్నేసింది. రాంమాధవ్‌ స్వయంగా వివేక్‌తో మాట్లాడి బీజేపీ నుంచి పోటీ చేయాలని కోరారు. అప్పటికే ఆ టికెట్‌ను ఎస్‌.కుమార్‌కు ప్రకటించినప్పటికీ, వివేక్‌ కోసం బీఫారంను నామినేషన్ల చివరి రోజు వరకు ఆపారు. అయితే, ఆ అభ్యర్థనను వివేక్ సున్నితంగా తిరస్కరించారు. తనకు బదులు సోదరుడు వినోద్‌కు సీటివ్వాలని కోరగా, అందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. దీంతో వివేక్ బీజేపీలో చేరే అంశం అక్కడే ఆగిపోయింది.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలు పెట్టింది. అదే సమయంలో.. భవిష్యత్తులో బీజేపీ బలమైన శక్తిగా మారుతుందని భావించిన వివేక్ ఆ పార్టీలో చేరేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. ఇటీవల రాంమాధవ్‌ను కలిసి తన అభీష్టాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. వివేక్‌ చేరికను కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కూడా ప్రోత్సహిస్తున్నారు.


కాషాయ పార్టీలోకి సీఎం కేసీఆర్ అన్న కూతురు..


టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్న కూతుర రేగులపాటి రమ్యారావు బీజేపీలో చేరనున్నారు. బుధవారం ఆమె ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి రాంమాధవ్‌ను కలిశారు. వారం రోజుల్లో బీజేపీలో చేరనున్నట్లు ఆమె ధ్రువీకరించారు. కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతూ గత ఎన్నికల ముందు రాజీనామా చేసిన రమ్యారావు ఆ తర్వాత ఏ పార్టీలో చేరలేదు. ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నారు. రాష్ట్రంలో టీడీపీ ఉనికిలో లేకుండా పోవడంతో ఆ పార్టీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన పార్టీ అగ్రనేతలను కలిశారు. వీరితోపాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నాయకులను చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>