M. Bala Krishna, Hyderabad, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు భారతీయ జనతాపార్టీ (Bharatiya Janatha Party) పావులు కదుపుతోంది. తిరుపతిలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఈ మేరకు రాష్ట్ర నాయకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారమే ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా.. ఏపీలో పార్టీ పరిస్థితిపై సమీక్షించేందుకు సోమవారం కూడా ఆయన తిరుపతిలో ఉన్నారు. దాదాపు నాలుగు గంటలకు పైగా జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం. ముఖ్యంగా టీడీపీ ఎంపీలుగా ఉండి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో గంటకు పైగా చర్చ జరిపారట అమిత్ షా. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను., వైసీపీ పార్టీకి లోపాయికారి ఒప్పందంతో అంతర్గత మద్దతు తెలిపే నాయకుల గురించి ఎంపీలతో చర్చించారనే ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.
ఇక టీడీపీ పార్టీతో సన్నిహితంగా ఉన్నారనే అంశాన్ని అమిత్ షా ఎంపీలతో ప్రస్తావించినట్లు సమాచారం. అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. పొత్తుల విషయంలో ఒకరిపై మరొకరు అమిత్ షా ముందే విమర్శలు చేసుకున్నారట. ఏపీ అధికార పార్టీకి మద్దతుగా ప్రతినిత్యం ఎంపీ జివిఎల్ నరసింహ రావు మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారని సమాచారం. అదే విషయంగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దియోధర్., జీవీఎల్ పై అమిత్ షా మండిపడ్డారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఏపీలో బిజేపికి వైసీపీ ప్రధాన శత్రువని, టీడీపీని ఎంత దూరం పెడుతున్నామో ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పార్టీని అంతే దూరంపెట్టాలని ఆదేశించారట. పొత్తుల ప్రస్తవన లేవనెత్తిన నేతలు.., ఏపీలో పొత్తులు అవసరం లేదని సునీల్ దియోధర్ ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని వాదించగా ఆలా చెప్పడానికి మీరు ఎవరు అంటూ సీఎం రమేష్ ప్రశ్నించారని సమాచారం. ఈ విషయంలో ఎవరు ఏమి మాట్లాడవద్దని.... అదంతా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారట అమిత్ షా.
అమరావతి అంశం కూడా నేతల మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అమరావతికి మద్దతుగా తీర్మానం చేసి ఇప్పుడు మద్దతు ఇచ్చే వారిపై ఎందుకు చర్యలు తీసుకుంటారని కూడా అమిత్ షా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనాలని దిశానిర్దేశం చేసినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు ఇటీవల జరిగిన బద్వేలు ఉపఎన్నిక ఫలితంపైనా అమిత్ షా ఆసక్తిగా నేతల్ని అడిగి తెలుసుకన్నారు. సాధారణ ఎన్నికల్లో ఒక్క శాతం కూడా ఓట్లు సాధించకపోయినప్పటికీ రెండేళ్లలోనే 14శాతానికి పెరగడంపై సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
అమిత్ షా తిరిగి వెళ్లే సమయంలో బద్వేలు నుంచి పోటీ చేసిన పనతల సురేష్‌ను బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమానాశ్రయంలో అమిత్ షాకు పరిచయం చేశారు. ఎన్నికల్లో బాగా పని చేశావని సురేష్‌ను అమిత్ షా అభినందించారని సమాచారం. .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Andhra Pradesh, Ap bjp