పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. త్వరలో జరగనున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో బరిలో నిలవనున్న సంగతి తెలిసిందే. అయితే మమతా బెనర్జీపై బీజేపీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారనే అంశంపై తాజాగా స్పష్టత వచ్చింది. భవానీపూర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్‌ను బీజేపీ ప్రకటించింది. భవానీపూర్ ఉప ఎన్నికలో గెలవడం మమతా బెనర్జీకి చాలా కీలకమనే సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు మమతా బెనర్జీ(Mamata Banerjee) సారథ్యంలోని టీఎంసీ 213 కైవసం చేసుకుంది. బీజేపీ 77 చోట్ల సాధించింది. అయితే నందిగ్రామ్ నుంచి బరిలో నిలిచిన మమతా బెనర్జి.. బీజేపీ అభ్యర్థి సువేందు చేతిలో ఓడిపోయారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీకి.. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే భవానీపూర్ నుంచి టీఎంసీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన.. చటోపాధ్యాయ్ (Shobhan Dev Chattopadhyay) తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీని బరిలో నిలిపేందుకు ఆయన తన సీటును వదులుకున్నారు. ఇక, గతంలో మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అయితే తాజాగా ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) భవానీపూర్‌తో పాటు సంషేర్‌గంజ్(Samserganj), జంగీపూర్(Jangipur) అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ స్థానాకుల సెప్టెంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 3వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే మిగతా రెండు నియోజవర్గాల ఉప ఎన్నికల సంగతి పక్కన బెడితే.. మమతా బెనర్జీ పోటీ చేయనున్న భవానీపూర్ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
Revanth Reddy: రేవంత్ రెడ్డిని నిరాశ పరిచిన రాహుల్ గాంధీ.. ఆ ప్లాన్ ఫలించలేదా ?
అయితే భవానీపూర్ స్థానం నుంచి బీజేపీ.. ప్రియాంక తిబ్రీవాల్ (Priyanka Tibrewal)ని నిలపనున్నట్టుగా ప్రకటించింది. అయితే ఆమె ఎవరు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 41 ఏళ్ల ప్రియాంక.. కోల్‌కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమె గతంలో బాబుల్ సుప్రియోకు లీగల్ అడ్వైజర్‌గా పనిచేశారు. అయితే 2014లో ఆమె బీజేపీలో చేరారు. 2015 లో ఆమె కోల్‌కతా(Kolkata) మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో వార్డ్ నంబర్ 58 నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె టీఎంసీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆరేళ్ల పాటు ఆమె బీజేపీలో పలు కీలక పనులను నిర్వర్తించారు. 2020లో ఆగస్టులో, పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఇక, బీజేపీ ఆమెను భవానీపూర్ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీపైన పోటీకి నిలిపింది. మరోవైపు సంషేర్‌గంజ్ నుంచి మిలన్ ఘోష్, జంగీపూర్ నుంచి సుజిత్ దాస్ పోటీకి నిలపనున్నట్టుగా బీజేపీ వెల్లడించింది.
ఇక, భవానీపూర్ ఉప ఎన్నికకు సంబంధించి సీఎం మమతా బెనర్జీ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు ఆమె తన నామినేషన్ పత్రాలు అందజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Mamata Banerjee, Trinamool congress, West Bengal