ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్న మూడు రాష్ట్రాలు.. అమలుచేయకుండా ఉండటం సాధ్యమేనా?

ప్రతీకాత్మక చిత్రం

పౌరసత్వ నమోదుపై ఆయా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. పార్లమెంటు ఆమోదించిన చట్టాలను రాష్ట్రాల్లో అమలుచేయకపోవడం సాధ్యమేనా? అన్న చర్చ జరుగుతోంది.

 • Share this:
  పౌరసత్వ సవరణ బిల్లు-2019 పార్లమెంటులో చట్ట రూపం దాల్చకముందే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిల్లును వ్యతిరేకించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్,కేరళ సీఎం పినరయి విజయన్.. ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలుచేసేది లేదని స్పష్టం చేశారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నంత వరకు జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్ఆర్‌సీ)కి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబర్ 16న కోల్‌కతాలో మెగా ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే పార్లమెంటులో ఈ చట్టాన్ని వ్యతిరేకించిన పార్టీల్లో.. ఎన్ని పార్టీలు దీన్ని తమ రాష్ట్రాల్లో అనుమతించకుండా ఉంటాయన్నది ప్రశ్నార్థకమే. పౌరసత్వ నమోదుపై ఆయా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. పార్లమెంటు ఆమోదించిన చట్టాలను రాష్ట్రాల్లో అమలుచేయకపోవడం సాధ్యమేనా? అన్న చర్చ జరుగుతోంది.

  రాజ్యాంగం ప్రకారం పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంది. ఆర్టికల్-256 ప్రకారం కేంద్రం చేసే చట్టాలకు రాష్ట్రాలు లోబడి ఉండాలి. సీనియర్ న్యాయవాదుల అభిప్రాయం ప్రకారం కేంద్రం చేసే చట్టాలను అమలుచేయకుండా ఉండే ఛాయిస్ రాష్ట్రాలకు లేదు. రాష్ట్రాల పరిధిలోని చట్టాల కంటే కేంద్రం చేసే చట్టాలు ప్రబలంగా ఉంటాయి కాబట్టి.. మినహాయింపులు ఉండటం దాదాపు అసాధ్యం. ఒకవేళ ప్రభుత్వాలు మొండికేసి చట్టాలను అమలుచేయకపోయినా.. హైకోర్టులు వాటిని అమలుచేస్తాయి.మాజీ లోక్‌సభ సెక్రటరీ, రాజ్యాంగ నిపుణులు పీడీటీ ఆచారీ కూడా ఈ వాదనతో ఏకీభవించారు. పార్లమెంట్ చేసిన చట్టాలను అమలుచేయం అని చెప్పే అధికారం రాజ్యాంగబద్దంగా ఏ రాష్ట్రానికి ఉండదన్నారు. రాజ్యాంగబద్దంగా పార్లమెంటు చేసే చట్టాలను రాష్ట్రాలు అమలుచేయాల్సిందేనన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిఘటించినా.. రాష్ట్ర అధికారిక యంత్రాంగాన్ని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు.

  పౌరసత్వ చట్టం అనేది పూర్తిగా దేశ సమాఖ్యకు సంబంధించిన విషయమని.. దీని అమలుకు రాష్ట్రాల పరిధిలోని సివిల్&జ్యుడీషియల్ యంత్రాంగ సహాయ సహకారాలు అవసరమని మరో సీనియర్ న్యాయవాది అన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించకపోతే.. కొన్ని రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టాన్ని అమలుచేయడం కేంద్రానికి సంక్లిష్టంగా మారుతుందన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అదే ధోరణిని కొనసాగిస్తే ఏమవుతుందన్న ప్రశ్నకు.. రాష్ట్రపతి పాలనకు దారితీయవచ్చునని ఆయన బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్ చట్టాలను అమలుచేయని పక్షంలో.. రాష్ట్రంలో రాజ్యాంగం విచ్చిన్నమైందని కేంద్రం వాదించే అవకాశం ఉందని, ఆపై అది రాష్ట్రపతి పాలనకు దారితీయవచ్చునని చెప్పారు.
  Published by:Srinivas Mittapalli
  First published: