పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చిచ్చు పెద్దదైందా? టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయానికి కారణం పీకే ఎఫెక్టేనా? అనే చర్చ ఊపందుకుంది. కోల్ కతా వేదికగా శనివారం చోటుచేసుకున్న పరిణామాలు ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి. తృణమూల్ పార్టీ జాతీయ చైర్ పర్సన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన మేనల్లుడు, రాజకీయ వారసుడిగా భావించే అభిషేక్ బెనర్జీకి భారీ షాకిచ్చారు. అభిషేక్ నిర్వహిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేసేశారు. ఇదే కాకుండా… పార్టీలోని ఇతర పదవులను కూడా రద్దు చేసేశారు దీదీ.
ఒక్క పార్టీ చైర్‌పర్సన్ అన్న పదవి మినహా అన్ని కమిటీలు, పదవులను మమతా బెనర్జీ రద్దు చేశారు. కొన్ని రోజులుగా టీఎంసీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి. సీనియర్లకు, జూనియర్లకు మధ్య గ్యాప్ వచ్చింది. వీరికే కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య కూడా గ్యాప్ వచ్చేసింది. అభిషేక్ అతి కారణంగా పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నారనే వార్తలు వస్తోన్న క్రమంలోనే మమత కీలక చర్యలకు ఉపక్రమించడం గమనార్హం.
ఒకే వ్యక్తి- ఒకే పదవి అన్న క్యాంపెయిన్‌ను మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హఠాత్తుగా తెరపైకి తెచ్చారు. దీంతో సీనియర్లు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి క్రమశిక్షణా రాహిత్యం తాండవిస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ శనివారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ చైర్‌పర్సన్ మినహా.. మిగతా పదవులన్నింటినీ తీసిపారేశారు. 20 మంది సభ్యులతో ఓ జాతీయ కార్యవర్గాన్ని మాత్రం ప్రకటించారు. ఇందులో మమతా అల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పేరు ఉంది. అయితే సీనియర్లైన సౌగతా రాయ్, ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ పేర్లు మాత్రం లేవు.
కొన్ని రోజులుగా పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య గ్యాప్ పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్టీలో మార్పులు అనివార్యమని అభిషేక్ బెనర్జీ గట్టిగా వాదిస్తున్నారు. అలా కుదరదని పార్టీ చీఫ్, సీఎం మమత తెగేసి చెప్పేశారు. అయినా అభిషేక్ తన మద్దతు దారులతో ఒకే వ్యక్తి-ఒకే పదవి అన్న క్యాంపెయిన్‌ను నడుపుతున్నారు. దీంతో సీనియర్లు, రెండు పదవులు అనుభవిస్తున్న వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పార్టీలో కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. పార్టీ సక్రమంగా నడుస్తున్న వేళ… అభిషేక్ తెచ్చిన ఈ తంటాతో సీఎం మమత ఆయనకే ఝలక్ ఇచ్చారు. ఆయన అనుభవిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టునే రద్దు చేసేశారు. సీనియర్లు అధికంగా ఉన్న జాతీయ కార్యవర్గ జాబితాలో ఆయన్ను చేర్చుతూ సీఎం మమత సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mamata Banarjee, Prashant kishor, TMC, West Bengal