తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి హడావుడి చేసిన సినీ నిర్మాత బండ్ల గణేశ్.. ఎన్నికలైపోగానే ప్యాకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. తాను ప్రజా సేవ చేయడానికి వచ్చానని ఎన్నికల సమయంలో ధీమాగా చెప్పిన ఆయన.. ఎన్నికల తర్వాత మాత్రం మీడియాకు ముఖం చాటేశారు. ఆ తర్వాత కొన్నిరోజులకు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నానని ఓ ప్రకటన ఇచ్చేశారు. తాజాగా టీవీ9 చానెల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్.. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడంపై వివరణ ఇచ్చారు.
తన మైండ్ సెట్ రాజకీయాలకు పనికిరాదని.. తనకు అందరితో సంబంధాలు అవసరమని బండ్ల గణేశ్ తెలిపారు. ఎన్నికల సమయంలో కేటీఆర్, కేసీఆర్‌లపై ఏదేదో మాట్లాడానని.. కానీ వారు ఏనాడు తనను ఒక్క మాట అనలేదని గుర్తుచేసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా.. తన కుమారుడిని కేటీఆర్ గారి అబ్బాయి వారి ఇంటికి తీసుకెళ్లాడని చెప్పారు. అలాంటి వ్యక్తులపై మాట్లాడినందుకు తప్పు చేశానని ఫీలైనట్టు చెప్పారు. రాజకీయాల్లో ఉంటే.. ఏ శత్రుత్వం లేకపోయినా ఎదుటోళ్లపై అన్యాయంగా ఆరోపణలు చేయడం తనకు నచ్చలేదన్నారు. అందుకే రాజకీయాలు ఇక తనకు సరిపడవని నిర్ణయించుకుని తప్పుకున్నానని చెప్పారు. తాత్కాలికంగా కాదు శాశ్వతంగానే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నట్టు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Congress, Telangana, Telangana Assembly, Trs