పీవీ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న బండి సంజయ్(ఫొటో-Facebook/Bandi Sanjay)
హైదరాబాద్‌లోని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘాట్లను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం ఉదయం సందర్శించారు.
హైదరాబాద్‌లోని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘాట్లను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్‌లపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. దేశ ద్రోహ వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న సీఎం కేసీఆర్.. పక్కా సమాచారం ఉంటే చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సమాచారం ఉంటే అటువంటి వారిని అరెస్ట్ చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని ఆయన వివరించారు. తెలగుజాతి ఆత్మగౌరవానికి పీవీ, ఎన్టీఆర్‌లు ప్రతీకలుగా నిలిచారని గుర్తచేశారు.
హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మట్లాడుతూ.. భాగ్య నగర్లో హిందువులంతా సంఘటితమవుతుంటే చూసి ఓర్వలేని టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ తో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తూ హిందువులను నిట్ట నిలువునా చీల్చాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగా మజ్లిస్ నాయకుల చేత మాజీ ప్రధాని పీవీ నర్సిహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చివేయాలంటూ డ్రామా లాడిస్తున్నారని అన్నారు. ఖబడ్డార్ మజ్లిస్ నాయకులారా.... పీవీ, ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చే దమ్ముందా మీకు? మీరు ఆ విగ్రహాలను కూల్చితే ఆ తరువాత రెండే రెండు గంటల్లో మీ దారుస్సలాం కోటను కూల్చివేస్తాం అంటూ హెచ్చరించారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేసి పాకిస్తాన్ వలస వాదులను, రోహింగ్యాలను తరిమికొడతాననే వ్యాఖ్యలను బండి సంజయ్ మరోసారి పునురుద్ఘాటించారు.
మరోవైపు ట్విటర్ వేదికగా కూడా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించి పాలన చేసిండని ఎన్టీఆర్ ఘాట్ కూల్చుతావా అంటూ ప్రశ్నించారు. పీవీ అయోధ్య విషయంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని పీవీ ఘాట్ కూల్చుతావా అంటూ నిలదీశారు. ఇక, గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. నాయకుల సవాళ్లతో గ్రేటర్ రాజకీయం వేడెక్కింది. ఇక, గ్రేటర్ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 1న జరగనుంది. డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.