Bandi Sanjay: 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. మరో బాంబు పేల్చిన బండి సంజయ్..

బండి సంజయ్(ఫైల్ ఫోటో)

మాతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 30 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాంబు పేల్చారు. శుక్రవారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సైను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

 • Share this:
  మాతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 30 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాంబు పేల్చారు.. అయితే తాము ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్దంగా వెళ్లబోమని ఆయన తేల్చిచెప్పారు. అందుకే వారిని పార్టీలోకి తీసుకోవడం లేదనన్నారు.. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని.. టీఆర్ఎస్ సర్కారును ప్రజలు ఓడించబోతున్నారన్నారు.. మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేనేలేదని ప్రకటించారు.. శుక్రవారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సైను కలిసిన అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయి నెల రోజులు గడిచాయి.. రాజ్యాంగం ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. కానీ టీఆర్ఎస్ సర్కారు, ఎస్ఈసీ దొంగనాటకాలు ఆడుతున్నాయి. ఇదే విషయమై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరాం.. మొదటి నుంచి ఎన్నికల కమిషన్ తీరును నేను ఎండగడుతూనే ఉన్నా.. అనేక విషయాల్లో నేనుచేసిన ఆరోపణలు నిజమయ్యాయి.

  కేసీఆర్, ఓవైసీ తీసుకున్న నిర్ణయాలనే.. ఎస్ఈసీ అమలు చేస్తోంది.. ప్రజల నిర్ణయాన్ని అవమానపరుస్తున్నారు.. రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు.. ప్రజల ఓట్లతో గెలిచిన కార్పొరేటర్లను అవమాన పరుస్తున్నారు.. ఎన్నికల్లో రిగ్గింగులకు పాల్పడ్డారు.. ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు.. ఎంఐఎం పార్టీ సహకారంతోనే టీఆర్ఎస్ కొన్నయినా సీట్లను గెలిచింది.. అడ్డదారిలో గెలిచారు.. గెలిచిన తర్వాతయినా ప్రజల ఆలోచనలను గమనించి.. ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకోవడం లేదు. మాకు రెండు నెలల టైమ్ ఉందని టీఆర్ఎస్ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారు.. మరి మూడు నెలల ముందే ఎన్నికలను ఎందుకు నిర్వహించారో గులాబీ బాస్ సమాధానం చెప్పాలి.. హైదరాబాద్ లో వరదలు ఉన్నాయి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. ఎన్నికలను వాయిదా వేయండి.. ప్రజలను పట్టించుకోండి. అని బీజేపీ చెప్పినా పట్టించుకోలేదు.. ఇప్పుడు ఎన్నికలు జరిపితేనే బీజేపీని ఓడిస్తామని.. పెద్దగా టైమ్ ఉండదు కాబట్టి ప్రతిపక్షాలు ప్రచారం చేయలేవని హడావిడిగా ఎన్నికలు పెట్టారు.

  స్థానిక సంస్థల అధికారాలను పూర్తిగా కాలరాస్తున్నారు.. అసలు ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లు నిజమైన కార్పొరేటర్లా..? గతంలో గెలిచిన వాళ్లు కార్పొరేటర్లా..? ఓడిపోయిన వాళ్లు కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు.. అడ్డగోలుగా అక్రమాలు చేస్తున్నారు.. దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు.. దోపిడీ దొంగలలెక్క తయారయ్యారు. ఓ లిస్ట్ తయారు చేసుకుని.. అన్నీ దోచుకున్నాకే కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేస్తామన్నట్టు ప్రవర్తిస్తున్నారు.. మీరు ఏ ధైర్యంతో ఎన్నికలు జరిపారో.. అదే ధైర్యంతో కొత్త పాలకమండలిని ఎన్నుకునే ప్రక్రియను మొదలుపెట్టండి.. గతంలో ఓ ఎన్నికల కమిషనర్ సారీ.. అన్నారు. ఈ ఎన్నికల కమిషనర్ అది కూడా చేయడం లేదు.. ‘ అని బండి సంజయ్ నిప్పులు చెరిగారు.. గవర్నర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ నేతలు ప్రభాకర్, రామచందర్ రావు, చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు..

  వాస్తవానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన వారిని కార్పొరేటర్లుగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత జీహెచ్ఎంసీకి కొత్త పాలక మండలిని ఎన్నుకునే ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది.. కానీ ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాలను చేపట్టలేదు.. ఈ పరిణామాలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఈసీ చేస్తున్న తాత్సారాన్ని గవర్నర్ కు తెలియజేయాలన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు రాజ్ భవన్ కు చేరుకున్నారు.. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తమిళ ఇసైతో బండి సంజయ్ బృందం భేటీ అయింది.

  నూతనంగా గెలిచిన కార్పోరేటర్లను గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసేలా ఎస్ఈసీని ఆదేశించాలని గవర్నర్ బండి సంజయ్ కోరారు.. అలాగే జీహెచ్ఎంసీకి కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఈసీకి సూచించాలని కోరారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి నెల వరకు సమయం ఉంది. ప్రస్తుత పాలకమండలి కాలపరిమితి పూర్తయ్యాకే కొత్త పాలకమండలి ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని టీఆర్ఎస్ సర్కారు భావిస్తోంది.. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇన్ని రోజులు అయినా.. కొత్త పాలక మండలిని ఎన్నుకునే ప్రక్రియను పెండింగ్ లోనే పెట్టింది.
  Published by:Nikhil Kumar S
  First published: