GHMC ELections: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ షాక్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. జనసేన సహా ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు తమను ఎవరూ పొత్తుల గురించి సంప్రదించలేదని బండి సంజయ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వేళ బండి సంజయ్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన జారీ చేశారు. ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్రంలోనూ, జీహెచ్ఎంసీ పరిధిలోను పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికులు నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయి. వారి వినతి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను. నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నారు. జీహెచ్ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పని చేస్తూ... ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకొంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది.’ అని ఆ ప్రకటనలో పవన్ కళ్యాణ్ చెప్పారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం తమ ప్రధాన ప్రత్యర్థి అని బండి సంజయ్ స్పష్టం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలవాలనుకుంటే, ఎంఐఎంకు ఎక్కువ సీట్లు ఇస్తుందని సంజయ్ అంచనా వేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న బీజేపీ ఆ జోష్‌ను జీహెచ్ఎంసీలో కూడా కొనసాగించాలని ఉత్సాహంగా ఉంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబరు 1న పోలింగ్ నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. ఈ రోజు ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సారి మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించిన్నట్లు తెలిపారు. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని వివరించారు. 18, 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. 21న వాటిని పరిశీలిస్తామన్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను, కేటాయించిన గుర్తులను ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 1 ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించారు. 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.