దుబ్బాక ఇచ్చిన కిక్ తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. దుబ్బాకలో అధికారపార్టీని మట్టికరిపించిన తరువాత అదే జోరు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కొనసాగించడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇందుకోసం ముఖ్యంగా అధికారపార్టీ పెద్దల వైఖరి నచ్చకుండా సర్ధుకుపోతున్న నేతలపై బీజేపీ శ్రేణులు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు భారీ స్థాయిలో పార్టీలోకి అధికారపార్టీ తోపాటు కాంగ్రెస్ నుంచి కూడా కీలక నేతలను తమ పార్టీకి చేర్చుకోవడం ద్వారా కేసీఆర్ అండ్ కో మానసికంగా దెబ్బకొట్టాలని పార్టీ అగ్రశ్రేణి నేతలు భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ చేరికలు కోసం రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇచ్చినట్లు రాజకీయవర్గాల సమాచారం. ఈ ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోరు పెంచినట్లు తెలుస్తోంది. సర్వే సత్యన్నారాయణ, కొండా విశ్వేశ్వర రెడ్డి లను తమ పార్టీ లోకి ఆహ్వానించారు.
విజయశాంతి కూడా మంగళవారం (నవంబర్ 24) బీజేపీలో చేరుబోతున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఈ చేరికలు క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ ను బలోపేతం చేయడంతోపాటు తమ ప్రత్యర్ధి పార్టీ నేతలను మానసికంగా దెబ్బతీసినట్లు అవుతుందని బీజేపీ శ్రేణులు భావిస్తోన్నాయి. కేవలం మాజీ ఎంపీలనే కాకుండా అధికారపార్టీలో ఉన్న కొంత మంది అసంతృప్తి నేతలపై కూడ బీజేపీ నేతలు కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ అసంతృప్తి నేతలకు సంబంధించిన లిస్ట్ ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసేనాటికి అధికారపార్టీ నుంచి దాదాపు 8 మంది కీలక నేతలు బీజేపీ కండువా కంప్పుకోవడానికి రెడీ అవుతున్నట్లు బీజేపీ నుంచి సమాచారం. ఇప్పటికే ఆ లిస్ట్ లో కొంత మంది నేతలతో బండి సంజయ్ మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అధికారపార్టీ మాత్రం ఈ చేరికలను... ఈ లీకులను పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం ఎన్నికలకు ముందు మైండ్ గేమ్ ఆడడంలో భాగంగా బీజేపీ నేతలు ఏదో చేయడానికి ప్రయత్నిస్తోన్నారు కాని వాస్తవాలు ప్రజలకు తెలుసని లైట్ తీసుకుంటున్నారు. అసలు బీజేపీ నుంచే తమ పార్టీలో చేరతామని పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ వస్తోన్నాయని ఇప్పుడు తమ అధినేత ఒక సిగ్నల్ ఇస్తే బీజేపీ మొత్తం ఖాళీ అయిపోతుందని వాదిస్తోన్నారు. మొత్తానికి ఎన్నికల ముందు ఈ చేరికలు ఏ పార్టీకి కలిసొస్తాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న లొసుగులను కూడా తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ప్రధాన నేతల మధ్య గ్యాప్ వలన ఇబ్బంది పడుతున్న క్యాడర్ ను తమవైపు తిప్పుకోవడం వలన కొంత మేర లాభపొందొచ్చన భావిస్తోన్నారు. అందుకే కొన్ని కీలక ప్రాంతాల్లో అక్కడ ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కు స్థానిక బీజేపీ నేతలు వల వేస్తోన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.