శాంతి భద్రతల సమస్య పేరిట ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే బీజేపీ చూస్తూఊరుకోదని అన్నారు. సురారం రోడ్ షోలో భాగంగా సంజయ్ మాట్లాడుతూ.. ఎన్నికల వాయిదాకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని.. ఆ ప్రయత్నాలకు అధికారులు సహకరిస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీజేపీకి వస్తున్న ఆదరణ అడ్డుకట్ట వేసేందుకు టీఆర్ఎస్ అనేక ప్రయత్నాలు చేస్తోందని విమర్శించాడు. దుబ్బాక ఉప ఎన్నికకు ముందు కూడా శాంతి భద్రత సమస్యను సృష్టిస్తున్నారని ప్రచారం చేశారని..ఇప్పుడు కూడా మళ్లీ అదే చేస్తున్నారని మండిపడ్డారు. భాగ్యనగరంలో కూడా దుబ్బాక ఫలితమే వస్తుందని ధీమ వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినా.. భాగ్యనరం అభివృద్ది కోసం నిధులు తీసుకొస్తున్నామని అన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్, మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీలకు మేయర్ అయ్యే అవకాశం ఇచ్చారు.. ఈసారి బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఈసారి బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొచ్చి భాగ్య నగర్ రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు.
ఇక, తన ప్రచారంలో బండి సంజయ్ దూకుడును కనబరుస్తున్నారు. మజ్లీస్, టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడతున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. "మేడమీద తలకాయ ఉన్నంత సేపు నేను ఏనాడూ అబద్దం ఆడనని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాద్ ప్రజలకు లక్ష డబుల్ బెడ్రూం కట్టిస్తానని ఐదేళ్ల నుండి చెబుతూనే ఉన్నాడు. కానీ ఒక్కటీ కట్టలేదు. నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చి ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. మరి మేడమీద తలకాయ లేని ఈ సీఎం మనకు అవసరమా?. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తాను అని చెప్పాడు. కానీ తీరా హైదరాబాద్‌ను ఖల్లాస్ చేసిండు.
దుబ్బాక ఉప ఎన్నికలో ప్రజలు కొట్టిన దెబ్బకు సీఎం మైండ్ బ్లాంక్ అయ్యింది. స్క్రిప్ట్ రాసి మజ్లిస్ తో రెచ్చగొట్టే మాటలు మాట్లాడిస్తుండు. 12 శాతం ముస్లిం ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తుండు. 12 శాతం ఓట్ల కోసం పాకులాడే వాళ్లేమో సెక్యూలర్లట. 80 శాతం హిందువుల మనోభావాలు, సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ మాత్రం మతతత్వ పార్టీ అట. యస్.. బీజేపీ హిందూ ధర్మం కోసం, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసినా, గోమాతను వధించే వాళ్లను ఎక్కడికక్కడ అడ్డుకునే పార్టీ బీజేపీ. పింక్, పచ్చ జెండాలతో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలొస్తున్నాయి. కాషాయా జెండా కమలం పువ్వుతో బీజేపీ మీ ముందుకొస్తున్నది. సీఎం నాపై ఆరోపణ చేస్తుండు. పేదలకిచ్చే రూ.10 వేలు ఎందుకు ఆపినవో ప్రమాణం చేద్దువ్ రా...తోక ముడిచిండు.
అల్లకల్లోలం చేసేందుకే భాగ్యలక్షీ ఆలయానికి నేను పోయానని ఓ మంత్రి చెప్తుండు. నేనొక్కటే అడుగుతున్నా... భాగ్య లక్ష్మీ అమ్మవారి ఆలయం పాకిస్తాన్ లో ఉందా? నువ్వే పాకిస్తాన్ అనుకుంటున్నావా? భాగ్య నగర్ ప్రజలారా....పాకిస్తాన్ భాగ్యనగర్ కావాలా?..హిందూస్తాన్ భాగ్య నగర్ కావాలా? మీరే తేల్చుకోండి. అరాచకాలు, అక్రమాలతో అడ్డదారిలో మజ్లిస్, టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలకు గుణ పాఠం చెప్పాలంటే బీజేపీకి ఓటేయాలి"అని పిలుపునిచ్చారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.