బాలయ్య ఓడితే టీడీపీ పరిస్థితి ఏంటి ? నందమూరి ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తుందా?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే... బాలయ్య తిరుగుబావుట ఎగరవేస్తారా ? పార్టీలో ముందు ఆయనే చంద్రబాబుకు వ్యతిరేకంగా గొంతు ఎత్తుతారా?

news18-telugu
Updated: April 24, 2019, 8:59 AM IST
బాలయ్య ఓడితే టీడీపీ పరిస్థితి ఏంటి ? నందమూరి ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తుందా?
బాలకృష్ణ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో ఫలితాలకు ముందు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. చంద్రబాబు ఓడితే టీడీపీ పరిస్థితేంటి? మళ్లీ ఆయనే ప్రతిపక్ష హోదాలో పార్టీ ముందుకు తీసుకెళ్తారా ? లేక పార్టీ పగ్గాలు లోకేష్ చేతికి అప్పగిస్తారా ? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతిలోకి తీసుకున్న చంద్రబాబు... ఎన్టీఆర్ వారసులకు మాత్రం పెద్దగా చేసిందేం లేదు. అటు హరికృష్ణ కానీ... ఇటు బాలకృష్ణ కానీ పార్టీతో ఎలాంటి పదవులు వరించలేకపోయారు.తన వెంటే ఉంచుకుంటూ వచ్చారు కానీ... ఎన్టీఆర్ వారసులకు చంద్రబాబు పెద్దగా వెలగబెట్టిందేమి లేదు. అటు ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరి అయితే ఎప్పుడు టీడీపీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కాంగ్రెస్‌లో కొంతకాలం పాటు ఉన్న ఆమె...తర్వాత బీజేపీ చెంతకు చేరింది. తాజా పరిస్థితికి వస్తే...ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీ కంచుకోటగా మారిన హిందూపురంలో ఎమ్మెల్యే టికెట్‌పై పోటీ చేసి గత ఎన్నికల్లో విజయం సాధించారు సినీ నటుడు బాలకృష్ణ. ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్యకు.. బాబు ఎలాంటి మంత్రి పదవి ఆఫర్ చేయలేదు. అదే సయమంలో కుమారుడు లోకేష్‌కు మాత్రం మూడు శాఖలను కేటాయిస్తూ మంత్రి పదవి కట్టబెట్టారు. లోకేష్‌కు చంద్రబాబు ఇస్తున్న ప్రయారిటీతో కొందరు సీనియర్లు టీడీపీలో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరికొందరు బాలయ్యను సైతం చంద్రబాబు పక్కన పెట్టారని వాదన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే... బాలయ్య తిరుగుబావుటా ఎగరవేస్తారా ? పార్టీలో ముందు ఆయనే చంద్రబాబుకు వ్యతిరేకంగా గొంతు ఎత్తుతారా? అంటే బాలయ్య వెనుక ఉంటే కొందరు సీనియర్ నేతలు అవుననే అంటున్నారు.

బాలయ్యకు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వలేదు. పార్టీలో మరే కీలక పదవి కూడా ఇవ్వలేదని కొందరు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలయితే... టీడీపీని మళ్లీ నందమూరి కుటుంబం చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కొందరు సీనియర్లు విశ్లేషణలు చేస్తున్నారు. బాబయ్ బాలయ్య చేతిలో పార్టీ ఉంటే.. అబ్బాయ్ ఎన్టీఆర్‌కు కూడా ఇష్టమేననే వాదన తెరపైకి వస్తోంది. అందుకే పార్టీ ఒకవేళ ఓటమి పాలయితే... బాలయ్య సారథ్యంలో పార్టీలో తిరుగుబాటు తప్పదని కొందరు జోస్యం చెబుతున్నారు.

మరోవైపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం... 14ఏళ్లు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలనచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అంత ఈజీగా పార్టీని చేజారనిస్తారా అంటే డౌటే మరి. ఎందుకంటే... మామ చేతిలో ఉన్న పార్టీని రాజకీయ చతురతతో తెలివిగా తన చేతిలోకి తీసుకొని... ఇన్నాళ్లు... విజయవంతంగా నడిపిన చంద్రబాబు... అంత సులభంగా దేన్ని వదులుకోరని రాజకీయాల్లో తలపండిన నేతలు అంటున్నారు.

 

First published: April 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు